30, నవంబర్ 2009, సోమవారం

శ్రీనాధుడు

శ్రీనాధుడు ఒక గొప్ప కవి. పల్నాటి వీర చరిత్రము, భీమ ఖండము వంటి కావ్యాలను వ్రాశాడు. శ్రీనాధుడి కావ్యాలలోని పద్యాలూ, అతని చాటుపద్యాలూ చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.

తెలుగు భాష గురించి శ్రీనాధుడి పద్యం
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి సౌభాగ్యసంపద తల్లికంటె
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె!

పల్నాటి ప్రయాణంలో నీరు దొరకక ఇక్కట్లు పడుతూ ఇలా అన్నాడు
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
(లక్ష్మీ వల్లభుడైనందున శ్రీనివాసుడు 16వేలమందిని పెళ్ళాడాడు. బిచ్చుమెత్తుకొనేవానికి ఇద్దరు భార్యలెందుకయ్యా! పార్వతిని నీవుంచుకొని గంగమ్మను మాకు ప్రసాదించు పరమేశ్వరా!)

అలాగే పలనాటి సీమలో పేదరికం వలన కళాపోషణకు అవకాశం కనిపించలేదు ఆయనకు. అందుకని
రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభయైన నేకులు వడకున్
కుసుమాస్త్రుడైన దున్నును
వసుధేశుండైన జొన్నకూడే కుడుచున్
మంచి కవిత్వం ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఇలా అన్నాడు.
హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫుర చ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌అని!
శివుని తలపైనున్న చంద్రవంకలాగా వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం, సరసత్వము కలిసి ఉంటేనే అది చిరకాలముండే కవిత్వము అవుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి