17, జులై 2011, ఆదివారం

ARUDRA RARE VIDEO

ITS A RARE VIDEO OF SRI ARUDRA,,,
WHEN HE VISITED TO TEXAS DUE TO PARTICIPATE IN TELUGU CUTURAL ASSN JUBILEE CELEBRATIONS,, THANKS TO ALL WHO R THE MEMBERS OF TCA

5, ఆగస్టు 2010, గురువారం

కోవెల సంపత్కుమార

కోవెల సంపత్కుమార
సాహిత్యం వెర్రితలలు వేస్తున్న కాలంలో కాలుజారకుండా నిలదొక్కుకున్న మనీషుల్లో సంపత్కుమార ఒకరు ..
భారతీయ జీవన మీమాంసను గ్రహించి గతంతో వర్తమాన భవిష్యతుల సామంజస్యాన్ని సాధించుకోవాలనే ప్రేరణ కలిగిన నిత్యసాధకుడు. ఏదో చేయాలనే తపన ఉండి దాన్ని గురించి నిర్దిష్టమైన ఆలోచన వ్యూహం కలిగిన సంపత్కుమార తారాపధంలో కలిసిపోయాడంటే నమ్మలేని నిజమ్.
ఒకప్పుడు వరంగల్లో ధూపాటి వెంకట రమణాచార్యులు, ఉదయరాజు శేషగిరిరావు.. ఆ తర్వాత హరిరాధాక్రిష్ణముర్తి, విశ్వనాథ వెంకటేశ్వర్లు.. ఇదే కోవకు చెందినా కోవెల ద్వయం .. సంపత్కుమార, సుప్రసన్న. వీళ్ళిద్దరూ నాకు రక్తసంబందికులే ఐన సాహిత్య పరంగా వీరితో అనుబంధం మరవరానిది,. ఎక్కువగా సుప్రసన్న పెద్దనాయనతో అనుబంధం ఉన్నప్పటికీ సంపత్తాతతో కేవలం సభానుబంధమే, తాతయ్య పుస్తకం రాసినప్పుడు సంపత్ తాత పంపిన ఆశీస్సులు మరింత బలాన్నిచ్చాయి. ఈరోజు సంపత్ తాత లేదంటే సాహితీ సంద్రం ముగబొఇనత్లెరాయడానికి మాటలు లేక ఆగిపోయిన పదాల నడుమ సంపత్ ధ్రువ తారకు నా స్మృత్యంజలి.

6, డిసెంబర్ 2009, ఆదివారం

అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

అమృతం కురిసిన రాత్రి

నా కవిత్వం
నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం,జరామయం

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణిస్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్రవిచిత్రాలు.

అగాథ బాధా పాథ పతంగాలూ
ద్జర్,అవీరుల కృతరక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగరవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఈరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు

దృశ్య భావాలు

ఘోష
హేష
మురళి
రవళి
కదలి కదలి
ఘణం ఘణం నిక్వణ క్వణల ఝణం ఝణం
బండిమువ్వ
కాలిగజ్జె
కలసిపోయి
పక్షిరెక్క
పొన్నమొక్క
జొన్న కంకె
తగిలి పగిలి
వానచినుకు చిటపటలో కలసి
కొబ్బరిమొవ్వ పిచ్చుక గొంతులో మెరసి
మూలుగు యీలుగు కేక
చప్పటులు చకచకలు నవ్వు
పొదివికొనీ అదిమికొనీ
కదలి కదలి
ఘోష
హేష
మురళి
రవళి
నా మనస్సులో నిశ్శబ్ధపు స్తంభంలా
నిలుచున్నవి
చదల చుక్క
నెమలి రెక్క
అరటిమొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క
కడలి వచ్చి ప్రిదిలినవ్వి
నవ్వి నవ్వి నీరెండల పరుగులెత్తి
మావి తోపు నీడనాడి
కుంద జాజి సేవంతుల
వంగ మల్లీ మందారాలు బంతులాడి
కొలనిగట్ల పడుచుపిల్ల
కుచ్చెళ్ళతో పంతమాడి
కలల మెట్ల వంగినడచి
అలల కడలి అంచులొరసి
నా తలపులో కలసిపోయి
నా పలుకులలో పరిమళించు
చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క

ప్రాతః కాలం చీకటి నవ్విన చిన్ని వెలుతురా! వాకిట వెలసిన వేకువ తులసివా! ఆశాకుంతల ధ్వాంతములో నవసి యిలపై వ్రాలిన అలరువా!-అప్స రాంగనా సఖీ చిరవిరహ నిద్రాపరిష్వంగము విడ ఉడు పథమున జారిన మంచు కలనా! ఆకలిమాడుచు వాకిట వాకిట దిరిగే పేదల సురిగే దీనుల సుఖ సుస్తిని చెరచే సుందర రాక్షసివా! యుద్ధాగ్ని పొగవో- వి రుద్ధ జీవుల రుద్ధ కంఠాల రొదలో కదిలెడి యెదవో! అబద్ధపు బ్రతుకుల వ్యవ హారాల కిక మొదలో? కవికుమారుని శుంభ త్కరుణా గీరమవా! శ్రీ శాంభవి కూర్చిన శివఫాల విలసితమౌ వెలుగుల విబూద్వా! దేశభక్తులూ, ధర్మ పురుషులూ చిట్టితల్లులూ,సీమంతినులూ ముద్దుబాలురూం ముత్తైదువలూ, కూడియాడుచు కోకిల గళముల పాడిన శుభాభినవ ప్రభాత గీత ధవళిమవా!

30, నవంబర్ 2009, సోమవారం

పోతన(POTANA)

పోతన ప్రసిద్ధ తెలుగు కవి. భాగవతాన్ని తెలిగించాడు. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి.


పోతన, వేమన, బద్దెన వంటివారు వ్రాసిన పద్యాలలో కొన్నింటినే ఎంచుకోవడం కష్టం. కొన్ని ముఖ్యమైన పోతన రచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ప్రార్ధనలు

భాగవతం ఆరంభంలో వ్రాసిన ప్రార్ధనా పద్యం ఇది. పోతన అంత్యప్రాసల అందం ఈ పద్యంలో స్పష్టంగా కనుపిస్తుంది.
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!

పోతన ముగురమ్మలనూ స్తుతించిన పద్యాలు చాలా మందికి నిత్య ప్రార్ధనా గీతాలు.
సరస్వతీ ప్రార్ధన. ఇందులో తెల్లనివైన 16 వస్తువులను సరస్వతి రంగుతో పోల్చాడు.
శారద నీరదేందు ఘన సార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ సుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!

అలాగే లక్ష్మీదేవిని స్తుతించాడు
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్

అమ్మల గన్నయమ్మ పార్వతికి మ్రొక్కాడు.
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా
వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!

రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్ముణీదేవి ఈశ్వరిని ప్రార్ధించే పద్యం. సంశయాకులయైన పడతి అమ్మవారిని శరణు జొచ్చి ఎలా బ్రతిమాలుతున్నదో చూడవచ్చును.
నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్
మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటిపె
ద్దమ్మ, దయాంబురాశివి గదమ్మ, హరిం బతి జేయుమమ్మ, నిన్
నమ్మిన వారి కెన్నడును నాశము లేదు గదమ్మ, యీశ్వరీ!

పోతన వినయ స్వభావానికి అద్దం పట్టేది ఈ పద్యం.
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామ భద్రుండట నే
పలికిన భవ హర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా !!

భగవత్తత్వం

గజేంద్రమోక్షంలో ఈ పద్యాలు సుపరిచితాలు. "దేవుడంటే ఎవరు?" అన్నప్రశ్నకు జవాబు చెప్పడఅనికీ, ఏ మతంవారైనా తమ దేవుడిని స్తుతించుకోవడానికి సముచితాలు.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్య లయు డెవ్వడు సర్వము తానెయైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
ఈ పద్యంలో భగవంతుని ఈ లక్షణాలు చెప్పాడు కవి.
జగం పుట్టడానికి కారకుడు
జగం ఆయనలో ఉంటుంది.
జగం ఆయనలో ముగుస్తుంది.
ఆయన పరమేశ్వరుడు (అందరికీ ప్రభువు)
అంతకూ మూల కారణం.
మొదలు. మధ్య, తుది లేనివఅడు.
అంతా తానే
ఆత్మ భవుడు (తనంత తానే జన్మించాడు)
లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా
మన శక్తి చాలనప్పుడు, వేరు మార్గం లేనప్పుడు దేవుడే దిక్కవుతాడు. ఇక నా వల్ల కాదు. పోరాడి అలసిపోయాను. ప్రాణాలు కడగడుతున్నాయి. నీవు తప్ప వేరు దిక్కు లేదు. పరమేశ్వరా రక్షించు. ఈశ్వరా కాపాడు. అని గజరాజు వాపోయాడు. -- "లావొక్కింతయు లేదు" అన్న పదాలు బాగా వాడుకలోకి వచ్చాయి. "లా" (Law) ఒక్కింతయు లేదు - అని సమకాలీన సమాజంపై చెణుకులు కూడా విసిరారు.
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై
వైకుంఠలో గొప్ప మేడలో మందార వన ప్రాంతంలో అమృత సరసు ప్రక్క చంద్రకాంత మణులతో చెక్కి కలువపూలు పరచిన పాన్పుపై శ్రీలక్ష్మీదేవితో వినోదిస్తున్న శ్రీహరి గజేంద్రుని శరణుఘోష విని సంరంభంతో బయలుదేరాడు. - ఈ పద్యం గురించి ఒక కధ ప్రచారంలో ఉంది. పోతన ఒక పాదం వ్రాసి, కలం సాగక, వ్రాత కట్టిపెట్టి పొలానికి వెళ్ళాడట. తిరిగి వచ్చి చూస్తే పద్యం పూర్తి అయిఉంది. ఇదేమిటని కూతురినడిగితే మీరే వచ్చి వ్రాశారు గదా నాన్నా అన్నదట. శ్రీరామచంద్రుడే తనపట్ల కరుణించి ఆ పద్యాన్ని పూర్తి చేసి ఉంటాడని పోతన భావించాడు.

సిరికిం జెప్పఁడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁజక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజ ప్రాణావనోత్సాహియై.
గజేంద్రుని కాచే తొందరపాటులో బయలుదేరిన శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రములను ధరింపలేదు. పరివారాన్ని, వాహనాన్ని పిలువలేదు. మొగంపై విరిసిన ముంగురులు చక్కనొత్తలేదు. వాదంలో పట్టుకొన్న లక్ష్మీదేవి పైటను కూడా వదలలేదు -- ఈ పద్యాన్ని గురించి కూడా ఒక కధ ప్రచారంలో ఉంది. ఆయుధాలూ, వాహనం కూడా లేకుండా బయలుదేరి గజేంద్రుని ఎలా రక్షిస్తాడు బావగారూ! అని శ్రీనాధుడు ఆక్షేపించాడట. అందుకు సమాధానం చెప్పడానికి పోతన కొడుకు నూతిలో ఒక రాయి వేసి, అమ్మో మామయ్య కొడుకు నూతిలో పడ్డాడని అరిచాడు. వెంటనే శ్రీనాధుడు పరుగెత్తిపోయి నూతి చుట్టూ చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాడు. త్రాడు, నిచ్చెన లాంటివి ఏమీ లేకుండా నీ కొడుకును ఎలా కాపాడుకొందామనుకొన్నావు మామయ్యా అని శ్రీనాధుని పోతన కొడుకు ఎత్తిపొడిచాడు. అట.

చదువు

చదువుకోమని హిరణ్య కశిపుడు ప్రహ్లాదునకు చెప్పిన విధం. "తండ్రీ" అని ఒక తండ్రి తన కొడుకును ఎంత చక్కగా బుజ్జగిస్తున్నాడో చూడవచ్చు.
చదువని వాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !

వర్ణనలు

వామనావతారం ఘట్టంలో వామనుడు త్రివిక్రముడై పెరిగిన విధాన్ని వర్ణించే ఈ రెండు పద్యాలూ చాలా ప్రసిద్ధి చెందినవి. "ఇంతింతై వటుడింతయై " అన్న పదాలను ఒక నుడికారంగా పలు సందర్భాలలో వాడుతారు. వామనుడు పెరిగిన కొద్దీ సూర్య బింబం స్థాయి ఎలా ఉందో రెండో పద్యంలో వివరంచాడు. ముందు గొడుగుగా ఉంది. తరువాత తలపైరత్నం. తరువాత మెడలో ఆభరణం. ఇలా చివరకు పాదపీఠం అయ్యంది.
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!

రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరో రత్నమై
శ్రవణాలంకృతి యై గళా భరణామై సౌవర్ణ కేయూర మై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచత్ ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠ మై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్ !!

సూర్యోదయ వర్ణనం
పౌలోమి దన బాలు పాన్పుపై గనువట్ట
బన్నిన పవడంపుబంతి యనగ
నాయురర్థముల వ్యయంబు లొత్తిలి చాటు
కాలజాంఘికుచేతి ఘంట యనగ
ఘనజంతుజీవితకాలరాసుల విధి
కొలువ నెత్తిన హేమకుంభ మనగ
బశ్చిమదిక్కంత పరగ గైసేయుచో
ముందట నిడుకొన్న ముకుర మనగ
గోకతాపోపశమదివ్యఘటిక యనగ
బద్మినీకాంతనోములఫల మనంగ
మూడుమూర్తుల సారంపు ముద్ద యనగ
మిహిరమండల ముదయాద్రిమీద నొప్పె.

సూర్యబింబం తూర్పుకొండపై ఉదయించింది. అది శచీదేవి తన పిల్లవాని పానుపుమీద కనిపించేట్టు చిలుకల పందిరికి అమర్చిన పగడాలబంతియా అన్నట్లుంది. ఆయుస్సనే ధనం వ్యయమై పోతున్నది అని గట్టిగా చాటుతున్న కాలమనే వార్తాహరునిచేతిలోని గంటయా అన్నట్లుంది. బ్రహ్మదేవుడు ప్రాణుల జీవితకాలమనే ధాన్యరాసులను కొలవడానికి ఎత్తిన బంగరుకుంచమా అన్నట్లుంది. పడమటిదిక్కు అనే అంగన అలంకరించుకునేటప్పుడు ముందుంచుకున్న అద్దమా అన్నట్లుంది. జక్కవల పరితాపం మాన్పే దివ్యమైన మందుగుళికయా అన్నట్లుంది, పద్మిని అనే నాయిక వ్రతఫలమా అన్నట్లుంది. ముమ్మూర్తుల వెలుగుముద్దయా అన్నట్లుంది.

సంభాషణా చాతుర్యం

గోప కాంతలు యశోదతో మొరపెట్టుకొన్న విధం. నీ కొడుకు ఆగడాలతో వేగలేకపోతున్నామమ్మా అని.
ఓ యమ్మ: నీ కుమారుడు
మాయిండ్లను బాలుబెరుగు మననీడమ్మా:
పోయెద మెక్కడి కైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ!
కిట్టయ్యను యశోద ఇలా నిలదీసింది. మన్నెందుకు తిన్నావురా కన్నా అని.
మన్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా! మ న్నేల మఱి పదార్ధము లేదే?
ఎబ్బే నేనెందుకు మన్ను తింటాను? వాళ్ళూరికే చాడీలు చెబుతున్నారు. అన్నాడు బాలకృష్ణుడు
అమ్మా! మన్ను దినంగనేశిశువనో? యాకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాగం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.

నవలాశిల్పం కొన్ని పరిశీలనలు…

-వడ్డెర చండీదాస్‌

నాటకానికీ కథకీ వున్నంత వయసులేదు, నవలకి. అవిపెద్దవి. యిది పసిది. ఐనా-రజస్వలయిన కుర్రది అర్జంటుగా హర్రీగా యెదిగి, కట్నం యిచ్చుకోలేని తన తండ్రిని భయపెట్టినట్లు దయ్యప్పిల్లలా తయారై కూచుంది నవల.
యింతకీ నవల అంటే యేవిటి ? అడక్యూడని ప్రశ్న. నవల అంటే నవలే.
మరేదో విషయం గురించి చెబుతూ, ‘నాకు తెలుసు. యేవిఁటో చెప్పమంటే నాకు తెలియదు’ – అని కొన్ని శతాబ్దాల క్రితం వో జిజ్ఞాసువన్నాడు. మాయామర్మం కింద కొట్టిపారేయదలిస్తే నేనో చిన్న ప్రశ్న అడుగుతాను-తీపి అంటే యేమిటి ? తీపి అంటే తియ్యగా వుండేది. తియ్యగాఅంటే ? చక్కెరలాగా వుండేది. చక్కెర యెలా వుంటుంది? తియ్యగా. తియ్యగా అంటే యెలా వుంటుంది? చక్కెరలాగా. చక్కెర యెలా వుంటుంది. తియ్యగా. తియ్యగా అంటె యెలా వుంటుంది? మూడురోజులు ‘కుస్తీ’ పట్టినా ఫలితం వుండదు. తీపి తినిపించండి. యిట్టే తెలిసిపోతుంది. తదనుభవం రవ్వంత కూడా లేని వ్యక్తికి, యే మౌలిక ప్రాతిపదికను గానీ నిర్వచనంలోకి యిమిడ్చి అందించటం సాధ్యపడదు.

నవలాశిల్పం గురించి నాకు తెలుసు. యేవిఁటో చెప్పమని అడిగితే మాత్రం నాకు తెలియదంటాను. అనుభవం లోంచి గ్రహించేందుకు వుపకరించే వివరణలు చెప్పటం వరకే. ఫలానా ఫలానా పుస్తకాలు (నవలలు) చదవండి నవలంటే యేవిఁటో మీకే అవగతవుతుందని చెప్పాల్సొస్తుంది. యీ దృష్ట్యా, నవలాశిల్పం గురించి కొంత ముచ్చటించుకోవొచ్చు.
నవల-నాటకం, కథ-అని అంటాం కాబట్టి నవల, నాటకం కాదు, కథకాదు. మరేవిఁటి?
నాటకంలో, యేదో యితివృత్తాన్నాధారం చేసుకుని కథేదో వుంటుంది – కథలో నాటకీయత దాదాపు లేనట్లే. నాటకంలో పాత్రల చేష్టలూ మాటలూ వుంటాయి. పానకంలో పుడకలా, రచయిత కాలికీ వేలికీ అడ్డు పడేందుకు అవకాశం లేదు. నాటకం చేష్టా ప్రదానం. వేదికమీద ఆడేందుకు తద్వారా ప్రేక్షకుల్లో (శ్రోతలుగూడా) నేరుగా ప్రత్యనుభూతిని కలిగిస్తుంది. కథ, ప్రధానంగా కథన రూపంలో (narrative) వుంటుంది. అంచేత, కథ చెప్పటంలో నేర్పు లేకపోతే విసుగ్గా (boring) తయారవుతుంది.
నాటకీయతనూ కథా కథనాన్నీ సంలీనం చేసి, సంభాషణులు తొడిగి, కథ చెబితే నవల అవుతుంది. అంచేత, చిన్నదైతే (సైజు) కథ, పెద్దదైతే నవల-అని నేను భావించను. నవల నవలే చిన్నదీ పెద్దదీ అంటూ వుండదు. పేజీల దృష్ట్యా దప్ప (సైజు) యిది నవలా శిల్పానికి మూలకందం.
వంద పేజీలకి పైగా సాగినంత మాత్రాన కథ, నవల అవదు. అరవై పేజీలకి మించనంత మాత్రాన నవల కథ అవదు.
నాటకం, కథ, నవల-వీటిని తులనాత్మకంగా పరిశీలిస్తే కొన్ని మౌలిక సామ్యాలూ విభేదాలూ కనిపిస్తాయి. వీటికీ వ్యాసానికీ (essay) చుక్కెదురు. వీటిలో వ్యాసపు ధోరణిని చొప్పించితే పరమఛండాలంగా తయారవుతాయి. నిజానికి మంచి నవలలుగా, కథలుగా నాటకాలుగా రూపించి నిలవ తగ్గ కొన్ని రచనలు, కేవలం కర్ట్‌ లెక్చర్స్‌ చొప్పించటం వల్ల భ్రష్టవఁయ్యాయి. యిందుక్కారణం, ఆయా శిల్పాల తత్వం బాగా తెలియకపోవటమూ కావచ్చు, మరేదైనా ‘బలహీనతా’ కావొచ్చు.
విసృత వర్గీకరణ దృష్ట్యా నవలా శిల్పంలోని రీతులను పరిశీలిస్తే.
ముఖ్యపాత్ర తనకి తానుగా కథ నడపటం-దృక్కోణం యెంత విసృతవైఁనదయినా, అది వైయక్తికమే అవుతుంది. యీ ధోరణిలో రాసిన నవలలో, ముఖ్యపాత్రకి తెలియటానికి వీలులేని సంఘటనలో విషయాలో దిగబడే పొరపాటు అప్పుడప్పుడూ జరిగితే జరగడానికి అవకాశం వుంటుంది. యీ పద్ధతి, నవలకంటే కథకి బాగా నప్పుతుంది.
కథాకథనం రచయిత నడపటం-యిది నవలా ప్రక్రియకి బాగా నప్పుతుంది. యిందులోనే మధ్యలోనే అక్కడక్కడా రచయిత మౌనవ్రతం ప్రారంభించి, పాత్రలచేత తమ గురించి తాము కొన్ని పిట్టకథల్లాటివి చెప్పుకునేలాగా చెయ్యటం, యింకో పద్ధతి. ఆ తరువాత-రచయిత తానే పూర్తిగా కథాకథనం సాగించటంలో రెండు రకాలున్నాయి. వకాల్తా పుచ్చుగుని, పుచ్చుకోకుండానూ. వకాల్తా పుచ్చుగుని చెప్పటం బాగా పాతపద్ధతి. పాత్రల ప్రవర్తనను మెచ్చుకుంటూనో నిరశిస్తూనో నైతికంగానో మరోరకంగానో తీర్పు చెబుతూ సంతోషించటమో విచారపడటమో కోపగించుకోవటమో లాంటి పనులు చేస్తూ కథాకథనం సాగిస్తారు. అవన్నీ చెయ్యాల్సింది మేమూ, మధ్య వీడెవడు (యిదవత్తె) అని విసుక్కుంటారు పాఠకులు. ఐతే, ముఖ్య పాత్ర తానుగా కథాకథనం సాగించే పక్షంలో అటువంటివన్నీ బాగానే వుండొచ్చు. నవలలోని పాత్రల గురించి అదే నవలలో వైయక్తికంగా ఫీల్ అవటానికి గానీ యేరకంగానైనా తీర్పు చెప్పటానికి గానీ, ఆ రచయితకి హక్కులేదు పొమ్మన్నారు, యిటీవలి దశాబ్దాలలో కొందరు ప్రముఖ ప్రపంచ సాహితీ వేత్తలు. యీ ధోరణిలో సాగినవాటిని యీ నాటి ‘ఆధునిక నవల’ (Modern Novel) గా చెప్పేందుకు యెంతమాత్రం వీలులేదు. వకాల్తా పుచ్చుకోకుండా చెప్పటం ఆధునిక నవలా శిల్ప లక్షణాలలో వొకటి. పాత్రలను రూపొందించి వాళ్ళని నేరుగా పాఠకులకు అప్పగించటం, ఆ పైన పాఠకులతో పాటు రచయిత తానూ వొక పాఠకుడిగా వాళ్ళ మీద తీర్పు చెప్పొచ్చు. తన అభిప్రాయాలనూ అభిరుచులనూ అనుసరించి ఫీలవనూవొచ్చు.
చేతనా స్రవంతి (Stream of Consciousness) మరొక పద్ధతి. యిది మరీ యిటీవలి కాలంలో వచ్చింది ప్రముఖంగా. యీ శతాబ్దంలో వొచ్చిన కొన్ని తాత్విక మానసిక సిద్ధాంతాల ప్రభావం వల్ల యీ పద్ధతి రూపొందినట్లు భావించవచ్చు. యిందులో పాత్రల మనోస్రవంతిని కళ్ళెంలేని గుఱ్ఱంలా పరిగెత్తనిస్తారు. చేతనలో చేతనా విచేతనా అంశాలూ, గతవూఁ వర్తమానవూఁ భవిష్యత్తూ బాహ్య అంతర అవధులూ అన్నీ కలగా పులగంగా అలుముకు పోతాయి. పోయి ఝరీ ప్రవాహంలా ముంచెత్తుతుంది. యిందులో రచయిత తానుగా చేసే పని చాలా తక్కువ. తీసుకున్న ఆ కొద్ది వర్తమాన సమయంలో బహిరంగంగా జరిగేవాటి మధ్య లింకుల్లో, ఆ ఝరీ ప్రవాహంలో యిమడజాలని వాటిని, రచయిత తానుగా తగిలిస్తాడు అనేకానేక కారణాల వల్ల పాత్రల మానసం విస్ఫులింగంలా సంచలితవైఁ మరొక వ్యక్తి రచయిత వివరణలోకి నప్పేలాగా యిమడని స్థితిలో యీ పద్ధతి బాగా వుపకరిస్తుంది. రచన మొత్తం యీ రీతిలో సాగితే, యెక్కువ మంది పాఠకులకు కొంత అయోమయం, అవగాహన, రవంత విసుగు కలిగే ప్రమాదం వుంటుంది. పాఠకపరిణతి వొక స్థాయికి వొస్తే తప్ప, యీ రీతికి అంతగా ఆదరణ వుండదు. నాకు తెలిసినంతలో – తెలుగులో చేతనా స్రవంతి నవల వొకే వొకటి వొచ్చింది, యిప్పటికి శ్రీ ‘నవీన్‌’ రాసిన ‘అంపశయ్య’.
కథాకథన ప్రధానమైన రీతి. పాత్రలు అన్నదీ అనుకున్నదీ అనుకోనిదీ, చేసిందీ చెయ్యాలనుకున్నదీ చెయ్యాలనుకోనిదీ, అమాంబాపతూ సోది చెప్పినట్లుగా చెప్పుకుపోతారు. యిది నవలా శిల్పానికి దూరమవుతుంది. ముఖ్యంగా, నాటకీయత లోపిస్తుంది.
సంభాషణ ప్రధానమైన రీతి. నాటకంలో సంభాషణలతో పాటు, నటనకి సంబంధించి బ్రాకెట్లో యిచ్చే దానికి బ్రాకెట్లు తీసేసి సంభాషణల దండ గుచ్చుతారు. నాణెంకి వొకవైపే చూపెట్టినట్లు, పాత్రల ఆంతర్యం పాఠకులకు అంతగా చిక్కదు. పూర్తిగా బిహేవియరిస్టు సైకాలజీ సిద్ధాంతానికి కట్టి పడేసుకుంటే తప్ప, యీ రీతి అభిలషణీయమవదు. పైగా కథనం లోపిస్తుంది.
సమగ్రరీతి నాటకీయతనూ కథాకథనాన్నీ సంలీనం (synthesise) చేసి పాత్రల స్వభావాన్ని విశదపరచే, కథా గమనానికి వుపకరించే, వాళ్ళ జీవితాల్లోని ముఖ్యమైన మలుపుల్ని తెలియజేసే లేదూ అటువంటి మలుపులకి దారి తీసే, సంభాషణలను జోడించి కథ నడుపుకు పోవటం. పాత్రలు తాము అనుకున్నది అంతాకాదు గానీ, వాళ్ళ అంతర్యపుటాంతర్యాన్ని వివరించే మానసిక సంఘటనల స్రవంతిని వాళ్ళకై వాళ్ళే వెలిబుచ్చుకోవటం పాత్రల మానసిక పరిస్థితినీ మూడ్‌నీ అనుసరించి బాహ్య ప్రకృతిని చిత్రించాల్సినపుడు వాళ్ళ ద్వారానే వర్ణించటం. అవసరమనిపించిన చోట్ల తాను ”రచయిత”గా చిత్రించటం. నైతికంగానో చట్టరీత్యానో మరోరకంగానో మరో మరో రకంగానో యెక్కడికక్కడ పాత్రల పీకల మీద ‘జడ్జీ’ఐ కూచోకుండా, అదంతా పాఠకులకి వొదిలెయ్యటము. అంతగా అనిపిస్తే నవల ముగించేసి, దాని మీద ‘జడ్జివ్యాసం’ రాసుకోవచ్చు. సూచన మాత్రంగా అందించే (suggestivity) ధోరణిని అవలంబించటం, వీటంటినీ మించి కూర్పులో ‘బిగి’.
యీనాటి ‘ఆధునిక నవల’ యీ సమగ్రరీతిలో సాగినట్లు చెప్పుకోవచ్చు. అన్నీ, కనీసం కొన్ని లక్షణాలైనా వున్నప్పటికీ, నవలాశిల్పం దృష్ట్యా చెప్పుకో తగిన రచనలా చాలా తక్కువ. అన్నీ వున్నా అవకతవకగా అస్తవ్యస్తంగా బిగిలేకండా కూర్పటంతో శిల్పం దెబ్బతింటోంది.
పత్రికలలో నవలలు సీరియల్స్‌గా రావటం మొదలయ్యాక రీడర్‌షిప్‌ పెరిగినమాట వాస్తవమే గానీ, పాఠకుల స్థాయి చెప్పుకోతగినంతగా పెరగలేదు. యీ సీరియళ్ళు, పత్రికాధిపతులకూ రచయితలకూ వ్యాపార ప్రకియగా మారుతున్నదేమోనని నా అనుమానం. వొకే కథావస్తు యితివృత్తాన్ని తిరగాబోర్లావేస్తూ, సంఘటనలు, స్థితిగతులు, పేర్లు సంభాషణలు తదితరాలను అటు ఇటూ చేస్తూ డజనో డజన్నరో కవలనవలలు వొకే రచయిత రాయటవూఁ కనిపిస్తోంది. తీసుకున్న యే అంశాన్ని గాని లోలోతులకు తరచని నేలబారు తనం (surfacial crawling) యెక్కువగా వున్నట్లనిపిస్తోంది. సంభాషణ, కథమెలిక, సంఘటన, వారవారం మలుపు, అపోహలు, అపార్థాలు, సెంటిమెంటు, రహస్య సంఘటనలు వంటి వాటిని అవుచిత్యాన్ని మించి వాడుకుంటూ యింకా యెదగాల్సిన పాఠకుల్ని యింకాకిందికి దిగలాగే ధోరణి యెక్కువగా కనిపిస్తోంది. యీ తాపత్రయంలో పడటం వల్ల నవలాశిల్పం అధోగతికి జారిపోతోంది. కొందరు పాత్రలు, కాసిన్ని సంభాషణలు, సంఘటనలు వుండి యే రెండొందల పేజీల దాకానో, లాక్కుపోతే నవల అవుతుందనే అభిప్రాయం అస్పష్టంగా యిటీవలి కాలంలో స్థిరపడిపోతున్నదేమోనని నా అనుమానం. తాళ ప్రమాణంలో టన్నుల తూకంలో దయ్యప్పిల్లలా తయారవుతున్న యీరకం సరుకు చూస్తుంటే తెలుగు నవలా సాహిత్యం చివరకేం కాబోతున్నట్లని దిగులు పుట్టుకొస్తుంది.
యీ దృష్ట్యా, తెలుగులో, చెప్పుకోతగిన ”ఆధునిక నవలలు” యేపాటి వున్నదీ గ్రహిస్తే తెలుగు నవలా భవిష్యత్తుకు వుపకరిస్తుంది.
యిటీవల, విప్లవనవల అని వినిపిస్తోంది. నాకు తెలిసినంతలో ఈ పేరున నవల యేది గానీ రాలేదు. విప్లవనవల అంటే నవలాశిల్ప రీతిలో విప్లవమా? ఐతే అభిలషణీయమే. లేక, శిల్ప విధ్వంసనలో విప్లవమా? శిల్పాన్ని కాలదన్నిన రచన, నిలిచే అవకాశం వుండదు. వొక్కొక్క సందర్భంలో ప్రచార సాధనంగా కొంత ప్రయోజనం సాధించవచ్చు. శిల్పాన్ని మన్నిస్తూనే ప్రయోజనాన్ని సాధించే రీతిలో రాయనూవొచ్చు. నాలుక్కాలాలపాటు నిలిచేలా మలచనూవొచ్చు. ధూత్తేరీ, అదంతా మాకొద్దు పొమ్మంటే, యెవరు మాత్రం యేం చెప్పగలరు ! లేక, శిల్పం గురించి కాక నవలా వస్తువు గురించా ? వస్తువుకి సంబంధించి విప్లవమంటే పరిశీలించాల్సిన అంశమే. యెంచేతంటే వస్తువు నుంచి పూర్తిగా విడదీసినప్పుడు, శిల్పం ‘తూతూమంత్రం’ ఐపోతుంది.
నవలాశిల్పమూ – వస్తువూ.
కళ కళ కోసమే అని అన్నా, కళ ప్రయోజనం కోసమే అని అన్నా రాసింది ‘సాహిత్యం’ అవ్వాలంటే శిల్పమూ వస్తువూ అనివార్యావసరం.
వస్తు ప్రసక్తి రాగానే వాస్తవమూ అవాస్తవమూ అనే అంశం తలెత్తుతుంది. యింతకీ వాస్తవం (realism) అంటే యేవిఁటి ? యీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలంటే, యీ ప్రస్తుతన ”రచన” పరిధిని మించిపోతుంది. అంచేత, దేనినైతే యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చునో, అది అనే దగ్గర ఆగిపోయి ముచ్చటిస్తాను అంతర బహిర శారీరక మానసిక అంశాలను యింద్రియాల ద్వారా నిర్ధారించవొచ్చు. దహించి వేసే అవమానమూ వాస్తవమే, తీపుగా కోస్తున్న చర్మం క్రింది పొక్కు వాస్తవమే. సంవేదనా వాస్తవమే, నడుస్తున్ననేలా వాస్తవమే. తీసుకునే వస్తువు, అసంబద్ధమూ అసంగతమూ కాకుండా వుండాలంటే అది వాస్తవ పరిధిలోనిదై వుండాలి. అంతర బహిర జగత్తులు, వ్యక్తీ సంఘమూ, శరీరమూ మనసూ-వీటిని వొకదాని నుంచొకటి పూర్తిగా వేరుచేసినప్పుడు మిగిలేది శూన్యం. మనిషి యెదుర్కుంటున్న సమకాలీన సమస్యలన్నీ, వస్తువే వాస్తవమే. వొకదాన్లో నుంచి వొకదాన్ని గమనిస్తూ గ్రహిస్తూ – ఆ సమస్యలకి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నాలన్నీ ప్రయోజనాలే. మానవత్వం దృష్ట్యా, సమస్య ఐకూచున్న ప్రతిదీ సాహిత్యవస్తువే.
శిల్పమూ వుంది. వస్తువూ వుంది. మరి పేచీ యొక్కడున్నట్లు !!

(సేకరణ : కడప జిల్లా రచయితల సంఘం సావనీర్‌ నుండి సానెట్‌)

Permalink

ఆరు పదుల తెలుగు కవిత

- డాక్టర్‌ ద్వా.నా. శాస్త్రి

స్వాతంత్య్రోద్యమం, పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం, సాంఘిక పునరుజ్జీవన ఉద్యమం, పాశ్చాత్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాలు ఆధునిక కవిత్వావిర్భావానికి దోహదం చేశాయి. మన రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పార్టీలు, సంస్కరణోద్యమాలు తెలుగు కవిత్వ స్వరూపాన్ని మార్చివేశాయి. అభినవ కవిత్వం కొత్త మలుపులతో కొత్త పుంతలు తొక్కింది. 1947 నుంచి నేటివరకు తెలుగు కవిత బహుముఖాలుగా వెలువడుతూ- విస్తరిస్తూ తెలుగు భాషా వైశిష్ట్యాన్ని, తెలుగువారి జీవన సమస్యల్ని, పరిపాలకుల దురాగతాల్ని, జీవన తత్వాల్నీ చాటి చెప్తూనే వుంది. ఎంత ఆధునికమైనా తెలుగు కవిత్వం మూలాల్ని విస్మరించలేదు. నూతన ప్రక్రియలతో పాటు ప్రాచీన ప్రక్రియలైన పురాణం, కావ్యం, శతకం, దండకం, అవధానం వంటివి సమాంతరంగా వెలువడుతూ ఉండటం విశేషం.


1947 నాటికి భావకవిత్వోద్యమం తెరవెనుకకి వెళ్ళింది. ఆ భావజాలం కొందరి కవులలో ఉన్నా- ఉద్యమస్థాయి కనిపించదు. ఈ కాలంలో అభ్యుదయ కవిత్వం తీవ్రస్థాయిలో వెలువడింది. శ్రీశ్రీ ఈ అభ్యుదయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తన అసామాన్య ప్రతిభతో తెలుగునాడును ఉర్రూతలూగించాడు. ఎక్కడ విన్నా శ్రీశ్రీ గేయాలే. నాటి యువతరాన్ని అభ్యుదయపథం వైపు తనతో లాక్కుని వెళ్ళినవాడు శ్రీశ్రీ. కత్తికంటే కలం గొప్పదని చాటి చెప్పినవాడు శ్రీశ్రీ. నవ్యసాహిత్య పరిషత్తు, సాహితీ సమితి, తెలంగాణా రచయితల సంఘం, సాధన, అ.ర.సం. వంటి సంస్థలు నవీన కవిత్వానికి అండగా నిలిచాయి. ప్రతిభ, అభ్యుదయ, కళాకేళి, సాహితి, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికలు తెలుగు కవులకు ఆటపట్టులయ్యాయి. కవులకి లోకానుభవం అవసరమైంది. ప్రపంచ పరిణామాల పట్ల అనుశీలన కవిత్వ హేతువైంది. గత నిరసనకి ప్రాధాన్యం పెరిగింది. సామాజిక స్పృహ (social consciousness) అనే పదానికి ప్రాముఖ్యం వచ్చింది. సమాజ శ్రేయస్సే కవిత్వ ప్రయోజనమైంది. జాతీయ దృష్టి నుంచి అంతర్జాతీయ దృష్టి అలవడింది.


”శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు” అన్న అభినవ ఋక్కు కేంద్రబిందువైంది. అలజడి, ఆందోళన, తిరుగుబాటు… కవిత్వ వస్తువులయ్యాయి. ”మార్క్సిజం” అభినవ కవిత్వానికి ప్రాణమయ్యింది. కవుల అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలయ్యాయి. దాశరథి, సోమసుందర్‌, ఆరుద్ర, అనిశెట్టి, కాళోజీ, రెంటాల, గంగినేని, కుందుర్తి, పురిపండా, మల్లారెడ్డి, సినారె వంటివారెందరో కొత్త కవిత్వాన్ని సృష్టించి తెలుగు కవిత్వానికి దిశానిర్దేశం చేశారు. వీరందరివల్ల నవ్య కవిత్వానికి వారసులు ఇబ్బడిముబ్బడిగా తయారయ్యారు.

అయితే – ఈ అభ్యుదయ ఉద్యమం దాదాపు 1965 వరకు ఉధృతంగా సాగింది. కవితారంగాన్ని చైతన్యపరచింది. సామాజిక రుగ్మతలపై శంఖం పూరించింది. వామపక్ష పార్టీలలో చీలికలు రావటం వల్ల అభ్యుదయ కవులు కూడా చేరిపోయారు. అభ్యుదయ కవులు సినీకవులయ్యారు. రాజీతత్వం అలవరచుకున్నారు. ప్రభుత్వ పదవుల కోసం, మెప్పు కోసం తాపత్రయపడ్డారు. దీంతో అభ్యుదయ ఉద్యమ తీవ్రత తగ్గి బలహీనపడింది.

ఆ తర్వాత ఆరుగురు యువకులు కలిసి దిగంబర కవిత్వోద్యమం తీసుకువచ్చారు. 1965లో నిఖలేశ్వర్‌, నగ్నముని, చెరబండరాజు, జ్వాలముఖి, మహాస్వప్న, భైరవయ్య అనే కవులు – ”మంచి కోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటంలేని చిరునవ్వులు చిందే సమాజం కోసం మా దిగంబర గొంతుకతో చెప్పదలచుకున్నాం” అంటూ మూడు కవితా సంపుటాలు తెచ్చారు. “నిరుద్యోగం, దారిద్య్రం, కుహనా రాజకీయాలు, మతకలహాలు, సాహిత్య వ్యాపారం, సెక్స్‌ రచనలు… వంటి వాటితో కూడుకున్న ఈ కుష్టు వ్యవస్థ”పై దుమ్మెత్తి పోశారు. ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌గా వచ్చిన దిగంబర కవిత్వంలో చాలామటుకు అశ్లీలంతో అసభ్య పదజాలంతో, దూషణలతో నిండి వుంది. అంత దిగంబరత్వం పనికిరాదని విమర్శకులూ, పాఠకులూ భావించారు. అందుకే 1968 నాటికే ఈ ఉద్యమం కనుమరుగైంది. ఆరుగురితో పుట్టి ఆరుగురితోనే పెరిగింది. ”వీళ్లు చేసేది అభ్యుదయ రచన కాదు. జాగృతి కోసం ధ్వంస రచన చేస్తారు”, ”ఈ దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకొనేటంతగా (ఈ సమాజం) పతనమైందా?” వంటి విమర్శలతో ఉద్యమంగా కాకుండా ఒక ధోరణిగానే నిలిచిపోయింది. పాలపొంగులాంటి ఆవేశం మాత్రమే సుమా! అనిపించింది.

‘మావో వజ్రాయుధం’ అంటూ 1970లో విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. విప్లవ కవిత్వం వాడిగా వేడిగా వెలువడింది. దీనికీ శ్రీశ్రీయే నాయకత్వం వహించవలసి వచ్చింది. అప్పటి జనచైనా వీరికి ఆదర్శం. మావోయిజం, లెనినిజం, మార్క్సిజాల సమ్మేళనం విప్లవ సిద్ధాంతంగా మారింది. సాయుధ పోరాటం ద్వారానే శ్రామికవర్గ విముక్తి కలుగుతుందనీ, సామ్రాజ్యవాద, పెత్తందారీ విధానాలను ‘కత్తికి కత్తి’ అనే విధంగా సమాధానం చెప్పాలనీ నిర్ణయించారు. ఎన్నికల బూటకపు పద్ధతిని ఎండగట్టారు. ఇటువంటి భావజాలంతో శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు, సత్యమూర్తి (శివసాగర్‌), నగ్నముని, జ్వాలాముఖి, కె.వి.రమణారెడ్డి మొదలైనవారు కవిత్వం రాశారు. దిగంబర కవులుగా వున్న వారు విరసంలో చేరారు. విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు, గద్దర్‌ మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళారు. కొడవటిగంటి కుటుంబరావు, చలసాని ప్రసాద్‌ వంటివారు విప్లవ కవిత్వం రాయకపోయినా విప్లవ కవులకి పాఠాలు చెప్పే గురువులయ్యారు. ప్రజా కళారూపాలు ఆసరాగా జనం దగ్గరికి విప్లవ కవిత్వం వెళింది. అయితే ఆ తర్వాత ఇది ‘రూటు’ మార్చుకుని – ‘నక్సలైట్‌’ ఉద్యమంగా, ‘పీపుల్స్‌వార్’ ఉద్యమంగా తయారైంది. విప్లవ కవులలో, నాయకులలో చీలికలు వచ్చాయి. ఎవరి గొడుగు వారిదే అయింది. ”ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అన్నవారే ఏకం కాకపోవటం ఒక పెద్ద విషాదం! భావజాలం ఎలా వున్నా ప్రజలు హింసను సహించలేరు – స్వాగతించలేరు. అందువల్ల 1980 తర్వాత ఉనికి కోసమే విప్లవ కవిత్వం కొనసాగుతోంది తప్ప అప్పటి ఊపులేదు.

ఇన్ని ఉద్యమాలూ వాదాలూ వచ్చినా ”ఆకాశంలో సగం” అయిన స్త్రీలను కవులెవరూ పట్టించుకోలేదన్న ఆవేదనతో, కసితో స్త్రీవాద ఉద్యమం వచ్చింది. ఇంగ్లీషులోగల ”ఫెమినిజం” తెలుగులో స్త్రీవాదమైంది. పురుషాధిక్యతపై ధ్వజమెత్తుతూ స్త్రీల విముక్తికై, ఆత్మగౌరవానికై రూపొందించబడిన ఆలోచనా ధోరణి స్త్రీవాదం. స్త్రీని తల్లిగా, భార్యగా మాత్రమే ముద్రవేయబడటం నుంచి మనిషిగా గుర్తింపు పొందే స్థితి రావాలని కవయిత్రులు కలమెత్తారు. లైంగిక వివక్షను నిరసించారు. స్త్రీకి సమానహక్కు, స్వేచ్ఛలు వీరి లక్ష్యాలు. ‘గురి చూసి పాడే పాట’, ‘నీలిమేఘాలు’ అనే స్త్రీవాద సంకలనాలు వీరి ధోరణిని వెల్లడిస్తాయి. ఓల్గా, జయప్రభ, కొండేపూడి నిర్మల, విమల, పాటిబండ్ల రజని, ఘంటసాల నిర్మల, మందరపు హైమవతి, కె.గీత వంటివారు తమ కవిత్వంతో కొత్త కోణాలను ఆవిష్కరించారు. పురుషాధిక్య భావజాలం గలవాళ్ళకి కనువిప్పు కలిగించారు. స్త్రీల సమస్యల్ని, వేదనల్ని ‘స్కానింగ్‌’ చేసినట్లు చూపించారు. పెళ్ళి, సంసారం, ఇంటిచాకిరీ, వంట, సంతానోత్పత్తి వంటి విషయాలపై కూడా గొప్ప కవితలు వెలువడ్డాయి. స్త్రీ వాదుల్లో కూడా ఉదారవాదులు, రాడికల్‌వాదులు, మార్క్సిస్టు వాదులు లేకపోలేదు.

1980 నుంచే స్త్రీవాదం ఉద్యమస్థాయిలో ప్రచారం పొందింది. కొంత సంచలనమూ తీసుకువచ్చింది. కానీ ఈ ఉద్యమం కూడా ఆ సంచలనాన్ని, ఆ తీవ్రతను క్రమేణా కోల్పోతూ వచ్చింది. అభ్యుదయ కవులలాగా ‘పాడిందే పాట’గా అయింది. పురుష ద్వేషం, శారీరక ధర్మాలకి పురుషులే కారణమనటం, కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను నిరసించడం లేదా వక్రభాష్యం చెప్పటం, సామ్రాజ్యవాద ప్రభావం ఉండటం వంటి కారణాల వల్ల స్త్రీవాద కవిత్వం విమర్శకు గురైంది. లింగవివక్షకే పరిమితం కాకుండా స్త్రీల స్వేచ్ఛ, హక్కుల కోసం ప్రాధాన్యం వహించి వుంటే మరింత వియవంతమయ్యేదన్న అభిప్రాయం కలిగింది. ఆవేశమూ, సెక్సూ, పెళ్ళిపై వ్యతిరేకతల వల్ల స్త్రీవాద సానుభూతిపరులను తగ్గించుకొంది. 2000 నాటికి బలహీనపడింది.

ఒకపక్క స్త్రీవాదం ఉద్వేగంతో, ఉత్తేజంతో వస్తున్న రోజుల్లోనే దళితవాదం మొదలైంది. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలోని అత్యంత ప్రధాన సమస్య ”కులసమస్య”ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు గాయం ఎక్కడుందో తెలుసుకోకుండా మందులు పూశారు… అంటూ దళితులు తమ గుండె చప్పుళ్ళను వినిపించారు. 1985 ప్రాంతం నుంచి సన్నటి మూలుగులతో ప్రారంభమై 1990-95 ప్రాంతాలలో ఉవ్వెత్తున ఎగసింది. పూలేఇజం, అంబేద్కరిజమ్‌ల సిద్ధాంతాలు ప్రాతిపదికగా దళిత ఉద్యమం బయలుదేరింది. ”అంటరానితనానికి గురై మూడు సహస్రాబ్దాలు జైల్లో బతికి పంచములని పిలువబడ్డ షెడ్యూల్డు కులాలకు చెందినవాళే దళితులు. వాళ్ళు హిందూ, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ సిక్కు మతాలకు చెందిన దళితులే. కుల సమస్య నిర్మూలన కాంక్షాభివ్యక్తి దళిత సాహిత్యం” అని ప్రకటించారు. మొదట్లో బి.సి.లు, ముస్లిములు కూడా దళితులుగానే చెప్పారు, ఆ తర్వాత బి.సి. కుంపటి వేరు, ముస్లిముల కుంపటి వేరు అయింది. కొంతకాలానికి దళితులలోనే మాల, మాదిగ బేధాలు (పూర్వం నుంచి ఉన్నవే) భగ్గుమన్నాయి. ”సంఘటితం కండి” అన్న అంబేద్కర్‌ పిలుపు గాలికి కొట్టుకుపోయింది.

అగ్రకులాల ఆధిపత్య ధోరణిని ప్రశ్నించడం, ఆత్మగౌరవం పొందడం, కులపీడనమై కన్నెర్రజేయడం, మనువాద సంస్కృతిని బద్దలుకొట్టడం, రాజ్యాధికారం… అనే లక్ష్యాలతో ”దళిత కవిత”, ”చిక్కనవుతున్న పాట”, ”పదునెక్కిన పాట”, ”ప్రవహించే పాట” వంటి కవితా సంకలనాలు వెలువడ్డాయి. శివసాగర్‌, ఎండ్లూరి సుధాకర్‌, సతీష్‌చందర్‌, జూలూరు గౌరీశంకర్‌, కత్తి పద్మారావు, మద్దూరి నగేష్‌బాబు, శిఖామణి, మొదలైన కవులెందరో కొత్తచూపుతో, దళిత జీవితాలలోని బహుముఖ పార్శ్వాలను వెలుగులోకి తెచ్చారు. గద్దర్‌, మాస్టర్‌ జీ, గూడ అంజయ్య, అంబటి వెంకన్న, వంగపండు మొదలైన వారు పాటల ద్వారా కులపీడనను ఎండగట్టారు. అయితే 2000 సంవత్సరం తర్వాత దళితుల్లో చీలికలు ఏర్పడ్డాయి. ‘ఎ, బి, సి, డి’ వర్గీకరణ వీళ్ళల్లో ద్వేషాల్ని రగిలించింది. ఈ అంశంపైనా కవిత్వం వెలువడింది. కానీ అంతకుముందున్న ‘సంఘటితం కావడం’ కనపడలేదు. కుల నిర్మూలన ధ్యేయం కాస్తా కుల అంతరాలకు దారితీసింది. దళిత బ్రాహ్మణులు తయారయ్యారు. కసి, దూషణలు చోటు చేసుకొన్నాయి. అయినా దళిత కవిత్వం వెలువడుతూనే వుంది.

ఎప్పుడైతే దళిత ఉద్యమంలో బి.సి.లు భాగస్వాములు కాలేదో అప్పుడు బి.సి.వాద కవిత సంకలనం వెలువడింది. కానీ ఇది కొనసాగలేదు. ఆ తర్వాత ముస్లింవాదం తలెత్తింది. అభద్రతాభావంతో ఈ దేశంలో హీనంగా జీవించవలసి వస్తోందనీ, హిందువుల ఆధిపత్యం వల్ల దీనంగా బతకవలసి వస్తోందనీ, ముస్లిముల పేదరికం పెరిగిపోతోందనీ, వేధింపులు ఎక్కువవుతున్నాయనీ కవులు ముస్లింవాద కవిత్వం రాయటం 2000వ సంవత్సరంలో మొదలైంది. దీనిని మొదట్లో మైనారిటీవాదంగా పిలిచారు. ”నా దేశంలో నేనొక కాందిశీకుణ్ణి” అంటూ ముస్లిం కవులు ”జిహాద్‌”, ”జల్‌జలా” వంటి సంకలనాలు వెలువడ్డాయి. ఖాదిర్‌ మొహియుద్దీన్‌, రసూల్‌, అఫ్సర్‌, ఖదీర్‌, ఖాజా, ఇక్బాల్‌చంద్‌, హనీఫ్‌, స్కై బాబా మొదలైనవారు ముస్లింవాద భావజాలంతో కవితా సంపుటాలు వెలువరించారు. షాజహానా, షెహనాజ్‌ వంటి ముగ్గురు నలుగురు కవయిత్రులు మాత్రమే ముస్లింవాద కవిత్వం రాస్తున్నారు. గుంటూరు ఏసుపాదం, కలేకూరి ప్రసాద్‌, మద్దూరి వంటి కొద్దిమంది క్రిస్టియన్‌ మైనారిటీల స్థితిని చిత్రీకరించారు తప్ప క్రిస్టియన్‌ మైనారిటీ కవిత్వం స్థిరపడలేదు. మైనారిటీల హక్కులు ప్రధాన ధ్యేయంగా ముస్లింవాద కవిత్వం వెలువడినా మొత్తం మీద హిందూమతంపైగల కసి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ముస్లింవాద కవిత్వంలో మత ప్రస్తావన ఎక్కువైంది. పైగా ఉర్దూ పదాల వాడకం అధికం. కరీముల్లా కవి ముస్లింవాదంలోని ఈ ధోరణులకి నిరసనగా ”ఇస్లాం వాదం” ప్రారంభించాడు. ఇస్లాంవాద కవిత సంకలనాలూ వెలువడ్డాయి. అయితే ఇదొక వాదంగా స్థిరపడవలసి ఉంది.

ఈ వాదాలూ ధోరణులూ ఇలా ఉండగా, ‘ప్రత్యేక తెలంగాణా’ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ కవులు ప్రాంతీయ స్పృహతో కవిత్వం రాయటం 1995 ప్రాంతంలో మొదలైంది. తెలంగాణా వివక్షకు గురవ అవుతోందనీ, తెలంగాణీయుల ఉనికి, భద్రత ప్రశ్నార్థకాలవుతున్నాయనీ దిగులు చెందుతూ తమ ప్రాంతం మీద తమకే అధికారం ఉండాలనీ, కోస్తా ఆంధ్రుల పెత్తనం అంతమవ్వాలనీ… ప్రాంతీయ అస్తిత్వవాదం వచ్చింది. తెలంగాణాపై ఎప్పటినుంచో గళమెత్తుతున్న కవి కాళోజీ మరింత బలంగా వక్కాణించారు. ”పొక్కిలి”, ”మత్తడి” వంటి సంకలనాలు ప్రాంతీయ స్పృహను శక్తివంతంగా చిత్రీకరించాయి. జూలూరు గౌరీశంకర్‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సిధారెడ్డి, వేణుసుంకోజు, యెన్నం ఉపేందర్‌, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన కవులు తెలంగాణా వాసుల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇస్తూ కవితలు రాశారు. తమ ఆత్మగౌరవాన్ని నిర్దిష్టమైన స్వరంతో వెల్లడించారు. కానీ – కొద్దిమంది కవితల్లో కోస్తా ప్రాంతంపై ద్వేషం కనిపిస్తుంది. దూషణ కూడా చోటు చేసుకొంది. తమ అస్తిత్వ పోరాటంలో ఆ ఆవేశం తప్పదంటారు. కసి, ద్వేషం వల్ల కవిత్వ వాతావరణం, సహవాసం దెబ్బతింటున్నాయన్నది మర్చిపోకూడదు. తెలంగాణా అస్తిత్వవాదం ప్రభావంతో రాయలసీమ కవులు, ఉత్తరాంధ్ర కవులు తమ ప్రాంతీయ స్పృహను వ్యక్తీకరిస్తూ కవిత్వం రాస్తున్నారు. కవితా సంకలనాలూ వెలువడుతున్నాయి. తెలంగాణాలో వెలువడిన దళిత కవిత్వంలో ఈ ప్రాంతీయ అస్తిత్వ వేదన బాగా ఎక్కువ. ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వంలో ధిక్కార స్వరం ఎక్కువైనా తెలుగు సాహిత్యరంగంలో ఇప్పుడు వీస్తున్న గాలి ఇదే!

కొంతకాలం తెలుగు కవిత్వంలో ఆధునికోత్తరవాదం లేదా ఆధునికానంతరవాదం అనే కొత్త ధోరణి ప్రచారంలో వుంది. ఇంగ్లీషులో దీన్ని ”పోస్ట్‌ మోడర్నిజం” అంటారు. పాశ్చాత్య సాహిత్యంలో ఈ ధోరణి 1960ల నాటికే వుండగా మన తెలుగులోకి 1990 తర్వాత ప్రవేశించింది. సిద్ధాంతాల అఖండతను ప్రశ్నిస్తూ ముందుకు వచ్చిన ఈ సిద్ధాంతం ఒక ఆలోచనా ధోరణి. సత్యం, హేతువు, హేతుబద్ధత, గుర్తింపు, విశ్వజనీనత, మహా కథనాలు వంటివాటిని ఆధునికోత్తరవాదం పూర్తిగా ఒప్పుకోదు, విశ్లేషించాలంటుంది. అఖండత స్థానంలో సాపేక్షత ఉండాలంటుంది. సమగ్రత, సార్వకాలీనతలను అంగీకరించదు. సామూహీకరణను నిరసిస్తుంది. అఖండ అర్థాల అంతరార్థాన్ని, ప్రతి అంశాన్ని ఖండఖండాలుగా చూడటాన్ని అంగీకరిస్తుంది. అయితే ఈ ఆధునికోత్తరవాదం ఇవాళ దాదాపుగా లేదని చెప్పాలి. దీనికి పెద్ద ఆదరణా లభించలేదు.

ఈ వాదాలతో పాటు కొంతకాలం ”అనుభూతివాదం” తెలుగు కవిత్వంలో ప్రచారం పొందింది. అనుభూతికి ప్రాధాన్యమిచ్చేది లేదా అనుభూతిని సాక్షాత్కరింపజెయ్యాలన్న తపన గలది అనుభూతి కవిత్వం. రాజకీయ వాదాలకి, సామాజిక స్పృహకి వ్యతిరేకంగా అనుభూతి కవిత్వం వెలువడింది. ఆత్మానుభూతుల్ని ‘శుభ్రం’గా వెల్లడించాలనీ, వ్యక్తివాదానికి లేదా శుద్ధ కళావాదానికి ప్రాధాన్యం ఇస్తూ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్‌, వేగుంట మోహనప్రసాద్‌, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ మొదలైనవారు అనుభూతి కవిత్వం రాశారు. తొలి అనుభూతి వాద కవిగా ”అమృతం కురిసిన రాత్రి” కవి బాలగంగాధర తిలక్‌ను చెప్పాలి. అనుభూతి కవిత్వం ఆత్మాశ్రయ కవిత్వానికి, అంతర్ముఖత్వానికి చెందుతుంది. అస్పష్టత వుంటుంది. కేవలం స్వప్న కవిత వంటిదనీ, సమాజానికి అంత ప్రయోజనం లేనిదనీ విమర్శకులు వెల్లడించారు. అయినా సీతారాం, సిద్దార్థ, నామాడి శ్రీధర్‌, కాశీభట్ల వేణుగోపాల్‌ మొదలైన వారు అనుభూతి కవిత్వం రాశారు.

పాశ్చాత్యవాదాల ప్రభావం ఆధునిక కవిత్వంపై చాలా ఉంది. వ్యక్తి స్వాతంత్య్రం ప్రధానంగా వెలువడిన వాదం ”అస్తిత్వ వాదం” (Externalism). ఆర్‌.ఎస్‌.సుదర్శనం, వేగుంట, నిఖిలేశ్వర్‌, మాదిరాజు రంగారావు వంటివారు ఈ ధోరణిలో కవిత్వం రాశారు. 1947 తర్వాత ఆధునిక కవిత్వాన్ని బాగా ప్రభావితం చేసినవాదం ”ప్రతీకవాదం” (Symbolism). సంవిధాన శిల్పానికి ప్రతీకవాదం ఉపకరించింది. కవి వాడిన ప్రతీకలు తెలిస్తే ఆనందమే. లేకపోతే అస్పష్టత తప్పదు. వస్తువును వ్యాఖ్యానించటానికి, అనల్ప భావాన్ని సంక్షిప్తంగా వివరించడానికి ప్రతీక తోడ్పడుతుంది. ప్రతీకలు కవిభావాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే వైయుక్తికమై ఉంటాయి. ”సమగ్ర భావమయ ప్రపంచం” ప్రతీకలలో దర్శనమిస్తుంది. ఆరుద్ర ”త్వమేవాహం” కావ్యం ప్రతీకాత్మక కావ్యం. శ్రీరంగనారాయణబాబు, శ్రీశ్రీ, శేషేంద్ర, సినారె వంటివారు ప్రతీకల్ని సమర్థవంతంగా ప్రయోగించారు. ఆధునిక కవి ‘ప్రతీక’లు లేకుండా మంచి కవిత్వం రాయలేడని చెప్పదగినంతగా ప్రతీకవాదం వ్యాపించింది.

ఆధునిక కవిత్వంలో భావచిత్రణ లేదా పదచిత్రణ (Imagism) ముఖ్యమైన కవితా శిల్పమైంది. కవిత్వంలో గొప్ప అభివ్యక్తికి ఈ భావచిత్రణ ప్రధానసాధనమైంది. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన ఈ ”టెక్నిక్‌”కి ఎజ్రాపౌండ్‌ను చెప్తారు. అతని ప్రభావంతోనే తెలుగులో ‘ఇమేజిజమ్‌’ను కవులు సమర్థవంతంగా ప్రయోగించారు. ”భావచిత్రం మనోనయనానికి రూపుకట్టేది. ఇంద్రియ స్పర్శగలది. శబ్దాల ద్వారా రూపుకట్టేది” – భావచిత్రం! కవితా నిర్మాణ సామగ్రిలో పదచిత్రణ ముఖ్యమైంది. పాఠకుడ్ని ఉత్తేజపరచటంలో, పాఠకుడిలో సంపూర్ణ అవగాహన, అనుభూతి కలిగించటంలో పదచిత్రణ తోడ్పడుతుందిగానీ – ఇక్కడ కూడా అస్పష్టత తప్పదు! డాడాయిజమ్‌ లేదా విధ్వంసనవాదం అనే ధోరణిలో కొందరు కవిత్వం రాశారుగానీ ఆదరణ లభించలేదు – పాఠకుల మెప్పు పొందలేకపోయింది. ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణ శాస్త్రం (Psycho analysis) ఆధారంగా ఆధునిక కవిత్వంలో కొంతమంది ”అధివాస్తవికతా వాదం” ప్రవేశపెట్టారు. దీనిని ‘సర్రియలిజమ్‌’ అంటారు. అన్వయరాహిత్యం, అవ్యక్త ప్రేలాపన, అజ్ఞాతంగా ఉన్నవాటిని బహిరంగపరచడం అధివాస్తవికతా లక్షణం. శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబులు ఈ తరహా కవిత్వం రాశారు. వేగుంట వారి వంటి కవిత్వంలోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. అయితే ఇది కేవలం ప్రయోగవాదంగానే నిలిచిపోయింది.

ఆధునిక కవిత్వంపై హేతువాద ప్రభావమూ కనిపిస్తుంది. ”నిర్హేతుకమైన భావాలకూ, ప్రమాణాలకూ తావులేకుండా, యదార్థమైన జ్ఞానాన్ని గుర్తించడమే హేతువాదం” అంటారు త్రిపురనేని రామస్వామి పద్యాలలో ఈ హేతువాద ధోరణిని వ్యాప్తిగావించారు. దళిత వాదంలో హేతుభావాల ఛాయలు కనిపిస్తాయి.

మానవుడే అన్నిటికి మూలం. మానవుడి సంక్షేమమే ప్రధానం. వ్యక్తి సమాజానికి బలి కాకూడదు. వ్యక్తి స్వేచ్ఛ, మానవ సంబంధాలు లేని సమాజం అభివృద్ధి చెందదు. మానవ జీవితం పవిత్రమైంది… అనే భావనలతో మానవతావాద కవిత్వం వెలువడింది. శేషేంద్ర, సినారె, కుందుర్తి, కాళోజీ, పాపినేని శివశంకర్‌, కొప్పర్తి మొదలైన కవుల కవిత్వంలో మానవతావాదం ఎక్కువగా కనిపిస్తుంది.

సుప్రసన్న, సంపత్కుమార, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి అనే నలుగురు కవులు చేతనావర్త ధోరణితో కవితా సంకలనాలు తెచ్చారు. అందుకే వీళ్ళని చేతనావర్త కవులు అంటారు. సంప్రదాయ స్పృహ, దేశభక్తి, ఆధ్యాత్మిక దృష్టి ఈ కవిత్వ లక్షణాలు. విదేశీ ”ఇజాల”ని అంగీకరించరు. ప్రగతివాద కవి మార్క్సిస్టు అయి ఉండాలనటం సరికాదంటారు. రాజకీయాలకు అతీతంగా కవి ఉండాలంటారు. ‘చేతనావర్త కవిత్వం’ అనే బృహత్‌ సంపుటం వెలువడింది. అయితే ఇది కొంతకాలం – ఒక ధోరణిగా పేరుపొందింది తప్ప – దీనివల్ల ప్రభావితులైనవారూ, అనుయాయులూ ఉన్నట్టుగానీ – బాగా ప్రచారం పొందిందనిగానీ చెప్పటం కష్టం. కొంతమంది ‘పైగంబర కవులు’గా, ‘నిరసన కవులు’గా కవిత్వం రాసినా గుర్తింపు రాలేదు.

ఇన్ని ఉద్యమాలూ, ఇన్ని నవీన ధోరణుల మధ్య పద్యకవిత్వం తన స్థానాన్ని పదిలం చేసుకొంది. ”నవ్య సంప్రదాయ ఉద్యమం”గా కొందరు ప్రకటించినా – దానిని ఉద్యమం అనటం సమంజసం కాదు. ఇదీ ఒక ధోరణి మాత్రమే! ఈ నవ్య సంప్రదాయానికి విశ్వనాథ సత్యనారాయణ నాయకుడు. గడియారం వేంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, ముదిగొండ వీరభద్రమూర్తి, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ఉత్పల సత్యనారాయణాచార్య, కరుణశ్రీ, పైడిపాటి సుబ్బరాయశాస్త్రి, వానమామలై వరదాచార్యులు మొదలైనవారి కావ్యాలు ఈ నవ్య సంప్రదాయ ధోరణికి చెందుతాయి. జాతీయతకీ, దేశీయతకీ, గత వైభవ సంస్మరణకీ, ప్రాచీన సాహిత్య వైశిష్ట్యానికీ ప్రాధాన్యం ఇస్తుందీ నవ్య సంప్రదాయం. ప్రాచీన సాహిత్యాన్ని నవీనంగా పునఃప్రతిష్టించాలని చెప్తుంది. పాశ్చాత్య సాహిత్యానికి బానిస కావద్దంటుంది. మన సంస్కృతినీ, వారసత్వాన్నీ గౌరవించాలని హితవు పలుకుతుంది. ‘జాతీయ దృక్పథం’ ఈ ధోరణికి ఉనాది. రాజకీయాలు లేని సాహిత్య సామాజిక స్పృహకి నవ్య సంప్రదాయ కవులు ప్రాధాన్యమిచ్చారు. అయితే మన గత వైభవాన్ని, మూలాల్ని మరచిపోకూడదని బోధించే ఈ వాదం ఉద్యమరూపం పొందలేదన్నది సత్యం.

1947 నుంచి ఆధునిక కవిత్వంలో రూప ప్రాధాన్యం గమనిస్తాం. పద్యరూపం ఆధునిక భావజాల ప్రకటనకి సముచిత రూపం కాదని ‘వచన కవిత’ అవతరించింది. ఇంగ్లీషులోగల ‘ఫ్రీవర్స్’ అనేది ‘వచన కవిత’గా వచ్చింది. సరళంగా, వాడుక భాషలో, నియమ రహితంగా, స్వేచ్ఛగా రాసే అభినవ రూపంగా ‘వచన కవిత’ వ్యాప్తి చెందింది. కుందుర్తి ‘ఫ్రీవర్స్‌ ప్రంట్‌’ ద్వారా వచన కవితోద్యమాన్ని చేపట్టారు. ‘వచన కవిత’ బహుళవ్యాప్తి పొందింది. ఇవాళ కవిత్వమంటే వచన కవిత్వమే అన్నంతగా ప్రాచుర్యం పొందింది. ‘మినీ కవిత్వం’ కూడా కొంతకాలం ఉద్యమస్థాయిలో వెలువడింది. అద్దేపల్లి రామమోహనరావు, రావిరంగారావు, కొల్లూరి, జివి పూర్ణచంద్‌, గుత్తికొండ సుబ్బారావు మొదలైనవారు మినీ కవిత్వోద్యమ సారథులయ్యారు. వచన కవిత్వాన్ని ఇమేజిజమ్‌, అస్పష్టత, వచనప్రాయం… అనే అవలక్షణాల నుంచి మినీ కవిత్వం వచన కవిత్వాన్ని రక్షించింది. వ్యంగ్యం, క్లుప్తతలు ప్రధానంగా వెలువడిన మినీ కవిత్వం కొత్త కవుల్ని తయారు చేసింది. కొల్లూరి ‘మినీ కవిత విప్లవం’ అనే సంకలనాన్ని మొదటగా తీసుకొచ్చాడు. నేటికీ రావి రంగారావు మినీ కవిత్వ ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నారు.

వచన కవిత్వంలో చెప్పుకోదగిన విశేష పరిణామం ‘దీర్ఘ కవిత’. కుందుర్తి కథా కావ్యాలు రావాలని పిలుపునిచ్చినా అప్పటికి ఎవరూ స్పందించలేదు. కథా కావ్యాలతో పాటు ఎక్కువగా దీర్ఘ కవితలు (Long poems) వెలువడ్డాయి- వెలువడుతూ ఉన్నాయి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై విశిష్టమైన దీర్ఘ కవితలు వెలువడ్డాయి. తెలంగాణా నుంచి ప్రాంతీయ స్పృహతో చాలా దీర్ఘ కవితలు వెలువడ్డాయి. జూలూరు గౌరీశంకర్‌, జూగంటి జగన్నాథం, ఛాయారాజ్‌ వంటివారు దీర్ఘకవితలు బాగా రాశారు. ఆచార్య సి.నారాయణరెడ్డి ‘ప్రపంచ పదులు’ అనే కొత్త రూపాన్ని సృష్టించారు. శారదా అశోకవర్ధన్‌ మాత్రమే ఈ కవితారూపంలో కవిత్వం రాశారు.

గురజాడ సృష్టించిన ‘ముత్యాలసరం’ రూపంలో కొందరు కావ్యాలు రాశారు. ఆధునిక కవిత్వంలో గేయం ప్రముఖ స్థానం ఆక్రమించుకుంది. గేయం, పాట అనే రూపాలు ఉద్యమ కవిత్వానికి ప్రధాన వాహికలయ్యాయి. విశ్వనాథ, పుట్టపర్తి, బోయి భీమన్న, సినారె, నాగభైరవ, విద్వాన్‌ విశ్వం, బాపురెడ్డి మొదలైనవారు గేయ కావ్యాలతో ప్రస్తుతికెక్కారు. బాలల గేయాలు రాసినవారిలో బి.వి.నరసింహారావు, చల్లా రాధాకృష్ణశర్మ, మిరియాల రామకృష్ణ, నార్ల చిరంజీవి, మసూనా, కరుణశ్రీ వంటివారు బాలల గేయాలు రాశారు.

ఉర్దూలో గజల్‌ కమనీయ కవితాలహరి. అయితే ఆ భాషలో ఎక్కువగా ఈ కవితా రూపం శృంగారపరంగా, తాత్త్వికపరంగా వుంది. దాశరథి కృష్ణమాచార్య గాలిబ్‌ గజల్స్‌ను మొదటగా తెలుగులోకి అనువదించారు. కానీ ఆచార్య సి.నారాయణరెడ్డి తెలుగు గజల్స్‌ సొంతంగా రాసి, పాడటమే కాకుండా గజల్‌ ప్రక్రియకి సామాజిక స్పృహను అద్దారు‌. జపనీస్‌ కవితారూపం ‘హైకూ’ బాగా ప్రచారం పొందింది. ‘హైకూ’ లక్షణాల్ని తెలుగులోకి తీసుకురావటం కష్టం కాబట్టి తెలుగు కవులు ఆ లక్షణాలను పాటించకుండా కేవలం మూడు పాదాలలో హైకూలు రాశారు. గాలి నాసరరెడ్డి, ఇస్మాయిల్‌, పెన్నా శివరామకృష్ణ, బి.వి.వి. ప్రసాద్‌ వంటివారు హైకూల సంపుటాలు ప్రచురించి హైకూ కవితా రూపానికి వ్యాప్తి కలిగించారు. రావి రంగారావు ‘సామాజిక హైకూలు’ రాశారు. ఏమైనా హైకూలలో ప్రగతిశీల భావాలకి, సామాజిక స్పృహకీ చోటు లేదనే చెప్పాలి.
ఆచార్య ఎన్‌.గోపి సొంతంగా ‘నానీ’లు అనే కవితా రూపంలో కవితలు రాసి ఎందర్నో ఆకర్షించారు. నానీలు ఇటీవలి కవితారూపంగా స్థిరపడింది. దాదాపు వందమంది కవులు, కవయిత్రులు ‘నానీ’లు రాశారు. నానీల కవితా సంపుటాలు డబ్బయి వరకు వెలువడ్డాయి. నాలుగు పాదాలలో 20-25 అక్షరాలతో నానీలుంటాయి. నానీలలో తాత్విక చింతనతోపాటు సామాజిక స్పృహ ఉండటం విశేషం.

వచన కవిత్వం ఎంతగా విస్తృతి చెందినా, మరెంతగా ప్రాచుర్యం పొందినా పద్య కవిత్వం వెలువడుతూనే వుంది. విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఈ కాలంలోనే వెలువడింది. పుట్టపర్తివారి ‘శివతాండవం’ ప్రజాదరణ పొందింది. ఉత్పల సత్యనారాయణాచార్యులు ”ఈ జంట నగరాలు – హేమంత శిఖరాలు” కావ్యం ద్వారా పద్యరచనకి కొత్త సొబగులు సమకూర్చారు. జ్ఞానానందకవి, సంపత్కుమార, బేతవోలు రామబ్రహ్మం, రసరాజు, ఆశావాది ప్రకాశరావు, బండ్లమూడి సత్యనారాయణ, అనుమాండ్ల భూమయ్య, నాగభైరవ, ఆచార్య తిరుమల, కులపతి, గరికిపాటి నరసింహారావు, వేముగంటి నరసింహాచార్యులు, కడిమిళ వరప్రసాద్‌ మొదలైనవారెందరో పద్య కవిత్వానికి వన్నెచిన్నెలు సమకూర్చి పద్యం తెలుగువాడి నాల్క అని చాటి చెప్పారు.

ఈ అరవై సంవత్సరాల తెలుగు కవిత్వంలో మరొక ముఖ్యమైన ఉద్యమం తెలంగాణా విముక్తి పోరాటం. దేశానికి స్వాతంత్య్రం లభించినా తెలంగాణా హైదరాబాద్‌ సంస్థానపు నిజాం నవాబు నిరంకుశ పాలనలోనే మగ్గిపోతోంది. నిజాం దుష్ట, నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా కవులు ఉద్యమించారు. దాశరథి, సోమసుందర్‌, కాళోజీ, ఆరుద్ర, రెంటాల మొదలైన కవులతో పాటు యాదగిరి వంటి ప్రజాకవులు నిజాం వ్యతిరేక కవిత్వం రాశారు. తెలంగాణా సాయుధ పోరాట కవిత్వం ప్రత్యేక స్థానం సంపాదించింది.

భాష విషయానికి వస్తే ఉద్యమాల ప్రభావంతో ‘భాషాస్వేచ్ఛ’ లభించింది. వ్యాకరణ సంకెళ్ళు విడిపోయాయి. ‘సారళ్యం’ ప్రాముఖ్యం వహించింది. ప్రజా కవిత్వం వల్ల, అభ్యుదయ, విప్లవ, దళిత ఉద్యమాల వల్ల ప్రజల భాషకి, వాడుక భాషకీ, మాండలికాలకీ ఆదరణ లభించింది. కోస్తా మాండలికేతర మాండలిక భాషలలో విశిష్టమైన కావ్యాలు వెలువడ్డాయి. ముఖ్యంగా తెలంగాణా మాండలికంలో విలక్షణమైన, ఉదాత్తమైన కావ్యాలు వచ్చాయి. గత అరవై సంవత్సరాల తెలుగు కవిత్వాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే బహుముఖాలుగా విస్తరిల్లుతోందనీ, ఇతర భాషలలోని కవిత్వంకంటే వస్తుపరంగా భాషాపరంగా ముందు వరుసలోనే ఉందనీ, ఈ ఆధునిక కవిత్వం సమాజపరమై మనిషి మనుగడ కోసం, మానవత్వం కోసం పరితపిస్తోందనీ, ‘కాదేదీ కవిత్వానికి అనర్హం’, ‘కవిత్వమొక తీరని దాహం’ అనేవి అక్షర సత్యాలనీ నిరూపిస్తూ దినదినాభివృద్ధి చెందుతోందని తెలుస్తుంది.

శ్రీనాధుడు

శ్రీనాధుడు ఒక గొప్ప కవి. పల్నాటి వీర చరిత్రము, భీమ ఖండము వంటి కావ్యాలను వ్రాశాడు. శ్రీనాధుడి కావ్యాలలోని పద్యాలూ, అతని చాటుపద్యాలూ చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.

తెలుగు భాష గురించి శ్రీనాధుడి పద్యం
జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశ భాషలందు తెలుగు లెస్స
జగతి సౌభాగ్యసంపద తల్లికంటె
మెచ్చుటాడుబిడ్డ మేలు కాదె!

పల్నాటి ప్రయాణంలో నీరు దొరకక ఇక్కట్లు పడుతూ ఇలా అన్నాడు
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
(లక్ష్మీ వల్లభుడైనందున శ్రీనివాసుడు 16వేలమందిని పెళ్ళాడాడు. బిచ్చుమెత్తుకొనేవానికి ఇద్దరు భార్యలెందుకయ్యా! పార్వతిని నీవుంచుకొని గంగమ్మను మాకు ప్రసాదించు పరమేశ్వరా!)

అలాగే పలనాటి సీమలో పేదరికం వలన కళాపోషణకు అవకాశం కనిపించలేదు ఆయనకు. అందుకని
రసికుడు పోవడు పల్నా
డెసగంగా రంభయైన నేకులు వడకున్
కుసుమాస్త్రుడైన దున్నును
వసుధేశుండైన జొన్నకూడే కుడుచున్
మంచి కవిత్వం ఎలా ఉంటుందో వర్ణిస్తూ ఇలా అన్నాడు.
హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫుర చ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌అని!
శివుని తలపైనున్న చంద్రవంకలాగా వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం, సరసత్వము కలిసి ఉంటేనే అది చిరకాలముండే కవిత్వము అవుతుంది.