30, నవంబర్ 2009, సోమవారం

ఆరు పదుల తెలుగు కవిత

- డాక్టర్‌ ద్వా.నా. శాస్త్రి

స్వాతంత్య్రోద్యమం, పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవం, సాంఘిక పునరుజ్జీవన ఉద్యమం, పాశ్చాత్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సిద్ధాంతాలు ఆధునిక కవిత్వావిర్భావానికి దోహదం చేశాయి. మన రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పార్టీలు, సంస్కరణోద్యమాలు తెలుగు కవిత్వ స్వరూపాన్ని మార్చివేశాయి. అభినవ కవిత్వం కొత్త మలుపులతో కొత్త పుంతలు తొక్కింది. 1947 నుంచి నేటివరకు తెలుగు కవిత బహుముఖాలుగా వెలువడుతూ- విస్తరిస్తూ తెలుగు భాషా వైశిష్ట్యాన్ని, తెలుగువారి జీవన సమస్యల్ని, పరిపాలకుల దురాగతాల్ని, జీవన తత్వాల్నీ చాటి చెప్తూనే వుంది. ఎంత ఆధునికమైనా తెలుగు కవిత్వం మూలాల్ని విస్మరించలేదు. నూతన ప్రక్రియలతో పాటు ప్రాచీన ప్రక్రియలైన పురాణం, కావ్యం, శతకం, దండకం, అవధానం వంటివి సమాంతరంగా వెలువడుతూ ఉండటం విశేషం.


1947 నాటికి భావకవిత్వోద్యమం తెరవెనుకకి వెళ్ళింది. ఆ భావజాలం కొందరి కవులలో ఉన్నా- ఉద్యమస్థాయి కనిపించదు. ఈ కాలంలో అభ్యుదయ కవిత్వం తీవ్రస్థాయిలో వెలువడింది. శ్రీశ్రీ ఈ అభ్యుదయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ తన అసామాన్య ప్రతిభతో తెలుగునాడును ఉర్రూతలూగించాడు. ఎక్కడ విన్నా శ్రీశ్రీ గేయాలే. నాటి యువతరాన్ని అభ్యుదయపథం వైపు తనతో లాక్కుని వెళ్ళినవాడు శ్రీశ్రీ. కత్తికంటే కలం గొప్పదని చాటి చెప్పినవాడు శ్రీశ్రీ. నవ్యసాహిత్య పరిషత్తు, సాహితీ సమితి, తెలంగాణా రచయితల సంఘం, సాధన, అ.ర.సం. వంటి సంస్థలు నవీన కవిత్వానికి అండగా నిలిచాయి. ప్రతిభ, అభ్యుదయ, కళాకేళి, సాహితి, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికలు తెలుగు కవులకు ఆటపట్టులయ్యాయి. కవులకి లోకానుభవం అవసరమైంది. ప్రపంచ పరిణామాల పట్ల అనుశీలన కవిత్వ హేతువైంది. గత నిరసనకి ప్రాధాన్యం పెరిగింది. సామాజిక స్పృహ (social consciousness) అనే పదానికి ప్రాముఖ్యం వచ్చింది. సమాజ శ్రేయస్సే కవిత్వ ప్రయోజనమైంది. జాతీయ దృష్టి నుంచి అంతర్జాతీయ దృష్టి అలవడింది.


”శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు” అన్న అభినవ ఋక్కు కేంద్రబిందువైంది. అలజడి, ఆందోళన, తిరుగుబాటు… కవిత్వ వస్తువులయ్యాయి. ”మార్క్సిజం” అభినవ కవిత్వానికి ప్రాణమయ్యింది. కవుల అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలయ్యాయి. దాశరథి, సోమసుందర్‌, ఆరుద్ర, అనిశెట్టి, కాళోజీ, రెంటాల, గంగినేని, కుందుర్తి, పురిపండా, మల్లారెడ్డి, సినారె వంటివారెందరో కొత్త కవిత్వాన్ని సృష్టించి తెలుగు కవిత్వానికి దిశానిర్దేశం చేశారు. వీరందరివల్ల నవ్య కవిత్వానికి వారసులు ఇబ్బడిముబ్బడిగా తయారయ్యారు.

అయితే – ఈ అభ్యుదయ ఉద్యమం దాదాపు 1965 వరకు ఉధృతంగా సాగింది. కవితారంగాన్ని చైతన్యపరచింది. సామాజిక రుగ్మతలపై శంఖం పూరించింది. వామపక్ష పార్టీలలో చీలికలు రావటం వల్ల అభ్యుదయ కవులు కూడా చేరిపోయారు. అభ్యుదయ కవులు సినీకవులయ్యారు. రాజీతత్వం అలవరచుకున్నారు. ప్రభుత్వ పదవుల కోసం, మెప్పు కోసం తాపత్రయపడ్డారు. దీంతో అభ్యుదయ ఉద్యమ తీవ్రత తగ్గి బలహీనపడింది.

ఆ తర్వాత ఆరుగురు యువకులు కలిసి దిగంబర కవిత్వోద్యమం తీసుకువచ్చారు. 1965లో నిఖలేశ్వర్‌, నగ్నముని, చెరబండరాజు, జ్వాలముఖి, మహాస్వప్న, భైరవయ్య అనే కవులు – ”మంచి కోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషి కోసం, కపటంలేని చిరునవ్వులు చిందే సమాజం కోసం మా దిగంబర గొంతుకతో చెప్పదలచుకున్నాం” అంటూ మూడు కవితా సంపుటాలు తెచ్చారు. “నిరుద్యోగం, దారిద్య్రం, కుహనా రాజకీయాలు, మతకలహాలు, సాహిత్య వ్యాపారం, సెక్స్‌ రచనలు… వంటి వాటితో కూడుకున్న ఈ కుష్టు వ్యవస్థ”పై దుమ్మెత్తి పోశారు. ఒక షాక్‌ ట్రీట్‌మెంట్‌గా వచ్చిన దిగంబర కవిత్వంలో చాలామటుకు అశ్లీలంతో అసభ్య పదజాలంతో, దూషణలతో నిండి వుంది. అంత దిగంబరత్వం పనికిరాదని విమర్శకులూ, పాఠకులూ భావించారు. అందుకే 1968 నాటికే ఈ ఉద్యమం కనుమరుగైంది. ఆరుగురితో పుట్టి ఆరుగురితోనే పెరిగింది. ”వీళ్లు చేసేది అభ్యుదయ రచన కాదు. జాగృతి కోసం ధ్వంస రచన చేస్తారు”, ”ఈ దిగంబరుల పైత్యాన్ని కవిత్వమనుకొనేటంతగా (ఈ సమాజం) పతనమైందా?” వంటి విమర్శలతో ఉద్యమంగా కాకుండా ఒక ధోరణిగానే నిలిచిపోయింది. పాలపొంగులాంటి ఆవేశం మాత్రమే సుమా! అనిపించింది.

‘మావో వజ్రాయుధం’ అంటూ 1970లో విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. విప్లవ కవిత్వం వాడిగా వేడిగా వెలువడింది. దీనికీ శ్రీశ్రీయే నాయకత్వం వహించవలసి వచ్చింది. అప్పటి జనచైనా వీరికి ఆదర్శం. మావోయిజం, లెనినిజం, మార్క్సిజాల సమ్మేళనం విప్లవ సిద్ధాంతంగా మారింది. సాయుధ పోరాటం ద్వారానే శ్రామికవర్గ విముక్తి కలుగుతుందనీ, సామ్రాజ్యవాద, పెత్తందారీ విధానాలను ‘కత్తికి కత్తి’ అనే విధంగా సమాధానం చెప్పాలనీ నిర్ణయించారు. ఎన్నికల బూటకపు పద్ధతిని ఎండగట్టారు. ఇటువంటి భావజాలంతో శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు, సత్యమూర్తి (శివసాగర్‌), నగ్నముని, జ్వాలాముఖి, కె.వి.రమణారెడ్డి మొదలైనవారు కవిత్వం రాశారు. దిగంబర కవులుగా వున్న వారు విరసంలో చేరారు. విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు ప్రసాదరావు, గద్దర్‌ మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళారు. కొడవటిగంటి కుటుంబరావు, చలసాని ప్రసాద్‌ వంటివారు విప్లవ కవిత్వం రాయకపోయినా విప్లవ కవులకి పాఠాలు చెప్పే గురువులయ్యారు. ప్రజా కళారూపాలు ఆసరాగా జనం దగ్గరికి విప్లవ కవిత్వం వెళింది. అయితే ఆ తర్వాత ఇది ‘రూటు’ మార్చుకుని – ‘నక్సలైట్‌’ ఉద్యమంగా, ‘పీపుల్స్‌వార్’ ఉద్యమంగా తయారైంది. విప్లవ కవులలో, నాయకులలో చీలికలు వచ్చాయి. ఎవరి గొడుగు వారిదే అయింది. ”ప్రపంచ కార్మికులారా ఏకంకండి” అన్నవారే ఏకం కాకపోవటం ఒక పెద్ద విషాదం! భావజాలం ఎలా వున్నా ప్రజలు హింసను సహించలేరు – స్వాగతించలేరు. అందువల్ల 1980 తర్వాత ఉనికి కోసమే విప్లవ కవిత్వం కొనసాగుతోంది తప్ప అప్పటి ఊపులేదు.

ఇన్ని ఉద్యమాలూ వాదాలూ వచ్చినా ”ఆకాశంలో సగం” అయిన స్త్రీలను కవులెవరూ పట్టించుకోలేదన్న ఆవేదనతో, కసితో స్త్రీవాద ఉద్యమం వచ్చింది. ఇంగ్లీషులోగల ”ఫెమినిజం” తెలుగులో స్త్రీవాదమైంది. పురుషాధిక్యతపై ధ్వజమెత్తుతూ స్త్రీల విముక్తికై, ఆత్మగౌరవానికై రూపొందించబడిన ఆలోచనా ధోరణి స్త్రీవాదం. స్త్రీని తల్లిగా, భార్యగా మాత్రమే ముద్రవేయబడటం నుంచి మనిషిగా గుర్తింపు పొందే స్థితి రావాలని కవయిత్రులు కలమెత్తారు. లైంగిక వివక్షను నిరసించారు. స్త్రీకి సమానహక్కు, స్వేచ్ఛలు వీరి లక్ష్యాలు. ‘గురి చూసి పాడే పాట’, ‘నీలిమేఘాలు’ అనే స్త్రీవాద సంకలనాలు వీరి ధోరణిని వెల్లడిస్తాయి. ఓల్గా, జయప్రభ, కొండేపూడి నిర్మల, విమల, పాటిబండ్ల రజని, ఘంటసాల నిర్మల, మందరపు హైమవతి, కె.గీత వంటివారు తమ కవిత్వంతో కొత్త కోణాలను ఆవిష్కరించారు. పురుషాధిక్య భావజాలం గలవాళ్ళకి కనువిప్పు కలిగించారు. స్త్రీల సమస్యల్ని, వేదనల్ని ‘స్కానింగ్‌’ చేసినట్లు చూపించారు. పెళ్ళి, సంసారం, ఇంటిచాకిరీ, వంట, సంతానోత్పత్తి వంటి విషయాలపై కూడా గొప్ప కవితలు వెలువడ్డాయి. స్త్రీ వాదుల్లో కూడా ఉదారవాదులు, రాడికల్‌వాదులు, మార్క్సిస్టు వాదులు లేకపోలేదు.

1980 నుంచే స్త్రీవాదం ఉద్యమస్థాయిలో ప్రచారం పొందింది. కొంత సంచలనమూ తీసుకువచ్చింది. కానీ ఈ ఉద్యమం కూడా ఆ సంచలనాన్ని, ఆ తీవ్రతను క్రమేణా కోల్పోతూ వచ్చింది. అభ్యుదయ కవులలాగా ‘పాడిందే పాట’గా అయింది. పురుష ద్వేషం, శారీరక ధర్మాలకి పురుషులే కారణమనటం, కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను నిరసించడం లేదా వక్రభాష్యం చెప్పటం, సామ్రాజ్యవాద ప్రభావం ఉండటం వంటి కారణాల వల్ల స్త్రీవాద కవిత్వం విమర్శకు గురైంది. లింగవివక్షకే పరిమితం కాకుండా స్త్రీల స్వేచ్ఛ, హక్కుల కోసం ప్రాధాన్యం వహించి వుంటే మరింత వియవంతమయ్యేదన్న అభిప్రాయం కలిగింది. ఆవేశమూ, సెక్సూ, పెళ్ళిపై వ్యతిరేకతల వల్ల స్త్రీవాద సానుభూతిపరులను తగ్గించుకొంది. 2000 నాటికి బలహీనపడింది.

ఒకపక్క స్త్రీవాదం ఉద్వేగంతో, ఉత్తేజంతో వస్తున్న రోజుల్లోనే దళితవాదం మొదలైంది. ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలోని అత్యంత ప్రధాన సమస్య ”కులసమస్య”ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు గాయం ఎక్కడుందో తెలుసుకోకుండా మందులు పూశారు… అంటూ దళితులు తమ గుండె చప్పుళ్ళను వినిపించారు. 1985 ప్రాంతం నుంచి సన్నటి మూలుగులతో ప్రారంభమై 1990-95 ప్రాంతాలలో ఉవ్వెత్తున ఎగసింది. పూలేఇజం, అంబేద్కరిజమ్‌ల సిద్ధాంతాలు ప్రాతిపదికగా దళిత ఉద్యమం బయలుదేరింది. ”అంటరానితనానికి గురై మూడు సహస్రాబ్దాలు జైల్లో బతికి పంచములని పిలువబడ్డ షెడ్యూల్డు కులాలకు చెందినవాళే దళితులు. వాళ్ళు హిందూ, బౌద్ధ, క్రైస్తవ, మహమ్మదీయ సిక్కు మతాలకు చెందిన దళితులే. కుల సమస్య నిర్మూలన కాంక్షాభివ్యక్తి దళిత సాహిత్యం” అని ప్రకటించారు. మొదట్లో బి.సి.లు, ముస్లిములు కూడా దళితులుగానే చెప్పారు, ఆ తర్వాత బి.సి. కుంపటి వేరు, ముస్లిముల కుంపటి వేరు అయింది. కొంతకాలానికి దళితులలోనే మాల, మాదిగ బేధాలు (పూర్వం నుంచి ఉన్నవే) భగ్గుమన్నాయి. ”సంఘటితం కండి” అన్న అంబేద్కర్‌ పిలుపు గాలికి కొట్టుకుపోయింది.

అగ్రకులాల ఆధిపత్య ధోరణిని ప్రశ్నించడం, ఆత్మగౌరవం పొందడం, కులపీడనమై కన్నెర్రజేయడం, మనువాద సంస్కృతిని బద్దలుకొట్టడం, రాజ్యాధికారం… అనే లక్ష్యాలతో ”దళిత కవిత”, ”చిక్కనవుతున్న పాట”, ”పదునెక్కిన పాట”, ”ప్రవహించే పాట” వంటి కవితా సంకలనాలు వెలువడ్డాయి. శివసాగర్‌, ఎండ్లూరి సుధాకర్‌, సతీష్‌చందర్‌, జూలూరు గౌరీశంకర్‌, కత్తి పద్మారావు, మద్దూరి నగేష్‌బాబు, శిఖామణి, మొదలైన కవులెందరో కొత్తచూపుతో, దళిత జీవితాలలోని బహుముఖ పార్శ్వాలను వెలుగులోకి తెచ్చారు. గద్దర్‌, మాస్టర్‌ జీ, గూడ అంజయ్య, అంబటి వెంకన్న, వంగపండు మొదలైన వారు పాటల ద్వారా కులపీడనను ఎండగట్టారు. అయితే 2000 సంవత్సరం తర్వాత దళితుల్లో చీలికలు ఏర్పడ్డాయి. ‘ఎ, బి, సి, డి’ వర్గీకరణ వీళ్ళల్లో ద్వేషాల్ని రగిలించింది. ఈ అంశంపైనా కవిత్వం వెలువడింది. కానీ అంతకుముందున్న ‘సంఘటితం కావడం’ కనపడలేదు. కుల నిర్మూలన ధ్యేయం కాస్తా కుల అంతరాలకు దారితీసింది. దళిత బ్రాహ్మణులు తయారయ్యారు. కసి, దూషణలు చోటు చేసుకొన్నాయి. అయినా దళిత కవిత్వం వెలువడుతూనే వుంది.

ఎప్పుడైతే దళిత ఉద్యమంలో బి.సి.లు భాగస్వాములు కాలేదో అప్పుడు బి.సి.వాద కవిత సంకలనం వెలువడింది. కానీ ఇది కొనసాగలేదు. ఆ తర్వాత ముస్లింవాదం తలెత్తింది. అభద్రతాభావంతో ఈ దేశంలో హీనంగా జీవించవలసి వస్తోందనీ, హిందువుల ఆధిపత్యం వల్ల దీనంగా బతకవలసి వస్తోందనీ, ముస్లిముల పేదరికం పెరిగిపోతోందనీ, వేధింపులు ఎక్కువవుతున్నాయనీ కవులు ముస్లింవాద కవిత్వం రాయటం 2000వ సంవత్సరంలో మొదలైంది. దీనిని మొదట్లో మైనారిటీవాదంగా పిలిచారు. ”నా దేశంలో నేనొక కాందిశీకుణ్ణి” అంటూ ముస్లిం కవులు ”జిహాద్‌”, ”జల్‌జలా” వంటి సంకలనాలు వెలువడ్డాయి. ఖాదిర్‌ మొహియుద్దీన్‌, రసూల్‌, అఫ్సర్‌, ఖదీర్‌, ఖాజా, ఇక్బాల్‌చంద్‌, హనీఫ్‌, స్కై బాబా మొదలైనవారు ముస్లింవాద భావజాలంతో కవితా సంపుటాలు వెలువరించారు. షాజహానా, షెహనాజ్‌ వంటి ముగ్గురు నలుగురు కవయిత్రులు మాత్రమే ముస్లింవాద కవిత్వం రాస్తున్నారు. గుంటూరు ఏసుపాదం, కలేకూరి ప్రసాద్‌, మద్దూరి వంటి కొద్దిమంది క్రిస్టియన్‌ మైనారిటీల స్థితిని చిత్రీకరించారు తప్ప క్రిస్టియన్‌ మైనారిటీ కవిత్వం స్థిరపడలేదు. మైనారిటీల హక్కులు ప్రధాన ధ్యేయంగా ముస్లింవాద కవిత్వం వెలువడినా మొత్తం మీద హిందూమతంపైగల కసి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ముస్లింవాద కవిత్వంలో మత ప్రస్తావన ఎక్కువైంది. పైగా ఉర్దూ పదాల వాడకం అధికం. కరీముల్లా కవి ముస్లింవాదంలోని ఈ ధోరణులకి నిరసనగా ”ఇస్లాం వాదం” ప్రారంభించాడు. ఇస్లాంవాద కవిత సంకలనాలూ వెలువడ్డాయి. అయితే ఇదొక వాదంగా స్థిరపడవలసి ఉంది.

ఈ వాదాలూ ధోరణులూ ఇలా ఉండగా, ‘ప్రత్యేక తెలంగాణా’ ఉద్యమ ప్రభావంతో తెలంగాణ కవులు ప్రాంతీయ స్పృహతో కవిత్వం రాయటం 1995 ప్రాంతంలో మొదలైంది. తెలంగాణా వివక్షకు గురవ అవుతోందనీ, తెలంగాణీయుల ఉనికి, భద్రత ప్రశ్నార్థకాలవుతున్నాయనీ దిగులు చెందుతూ తమ ప్రాంతం మీద తమకే అధికారం ఉండాలనీ, కోస్తా ఆంధ్రుల పెత్తనం అంతమవ్వాలనీ… ప్రాంతీయ అస్తిత్వవాదం వచ్చింది. తెలంగాణాపై ఎప్పటినుంచో గళమెత్తుతున్న కవి కాళోజీ మరింత బలంగా వక్కాణించారు. ”పొక్కిలి”, ”మత్తడి” వంటి సంకలనాలు ప్రాంతీయ స్పృహను శక్తివంతంగా చిత్రీకరించాయి. జూలూరు గౌరీశంకర్‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సిధారెడ్డి, వేణుసుంకోజు, యెన్నం ఉపేందర్‌, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన కవులు తెలంగాణా వాసుల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇస్తూ కవితలు రాశారు. తమ ఆత్మగౌరవాన్ని నిర్దిష్టమైన స్వరంతో వెల్లడించారు. కానీ – కొద్దిమంది కవితల్లో కోస్తా ప్రాంతంపై ద్వేషం కనిపిస్తుంది. దూషణ కూడా చోటు చేసుకొంది. తమ అస్తిత్వ పోరాటంలో ఆ ఆవేశం తప్పదంటారు. కసి, ద్వేషం వల్ల కవిత్వ వాతావరణం, సహవాసం దెబ్బతింటున్నాయన్నది మర్చిపోకూడదు. తెలంగాణా అస్తిత్వవాదం ప్రభావంతో రాయలసీమ కవులు, ఉత్తరాంధ్ర కవులు తమ ప్రాంతీయ స్పృహను వ్యక్తీకరిస్తూ కవిత్వం రాస్తున్నారు. కవితా సంకలనాలూ వెలువడుతున్నాయి. తెలంగాణాలో వెలువడిన దళిత కవిత్వంలో ఈ ప్రాంతీయ అస్తిత్వ వేదన బాగా ఎక్కువ. ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వంలో ధిక్కార స్వరం ఎక్కువైనా తెలుగు సాహిత్యరంగంలో ఇప్పుడు వీస్తున్న గాలి ఇదే!

కొంతకాలం తెలుగు కవిత్వంలో ఆధునికోత్తరవాదం లేదా ఆధునికానంతరవాదం అనే కొత్త ధోరణి ప్రచారంలో వుంది. ఇంగ్లీషులో దీన్ని ”పోస్ట్‌ మోడర్నిజం” అంటారు. పాశ్చాత్య సాహిత్యంలో ఈ ధోరణి 1960ల నాటికే వుండగా మన తెలుగులోకి 1990 తర్వాత ప్రవేశించింది. సిద్ధాంతాల అఖండతను ప్రశ్నిస్తూ ముందుకు వచ్చిన ఈ సిద్ధాంతం ఒక ఆలోచనా ధోరణి. సత్యం, హేతువు, హేతుబద్ధత, గుర్తింపు, విశ్వజనీనత, మహా కథనాలు వంటివాటిని ఆధునికోత్తరవాదం పూర్తిగా ఒప్పుకోదు, విశ్లేషించాలంటుంది. అఖండత స్థానంలో సాపేక్షత ఉండాలంటుంది. సమగ్రత, సార్వకాలీనతలను అంగీకరించదు. సామూహీకరణను నిరసిస్తుంది. అఖండ అర్థాల అంతరార్థాన్ని, ప్రతి అంశాన్ని ఖండఖండాలుగా చూడటాన్ని అంగీకరిస్తుంది. అయితే ఈ ఆధునికోత్తరవాదం ఇవాళ దాదాపుగా లేదని చెప్పాలి. దీనికి పెద్ద ఆదరణా లభించలేదు.

ఈ వాదాలతో పాటు కొంతకాలం ”అనుభూతివాదం” తెలుగు కవిత్వంలో ప్రచారం పొందింది. అనుభూతికి ప్రాధాన్యమిచ్చేది లేదా అనుభూతిని సాక్షాత్కరింపజెయ్యాలన్న తపన గలది అనుభూతి కవిత్వం. రాజకీయ వాదాలకి, సామాజిక స్పృహకి వ్యతిరేకంగా అనుభూతి కవిత్వం వెలువడింది. ఆత్మానుభూతుల్ని ‘శుభ్రం’గా వెల్లడించాలనీ, వ్యక్తివాదానికి లేదా శుద్ధ కళావాదానికి ప్రాధాన్యం ఇస్తూ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఇస్మాయిల్‌, వేగుంట మోహనప్రసాద్‌, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ మొదలైనవారు అనుభూతి కవిత్వం రాశారు. తొలి అనుభూతి వాద కవిగా ”అమృతం కురిసిన రాత్రి” కవి బాలగంగాధర తిలక్‌ను చెప్పాలి. అనుభూతి కవిత్వం ఆత్మాశ్రయ కవిత్వానికి, అంతర్ముఖత్వానికి చెందుతుంది. అస్పష్టత వుంటుంది. కేవలం స్వప్న కవిత వంటిదనీ, సమాజానికి అంత ప్రయోజనం లేనిదనీ విమర్శకులు వెల్లడించారు. అయినా సీతారాం, సిద్దార్థ, నామాడి శ్రీధర్‌, కాశీభట్ల వేణుగోపాల్‌ మొదలైన వారు అనుభూతి కవిత్వం రాశారు.

పాశ్చాత్యవాదాల ప్రభావం ఆధునిక కవిత్వంపై చాలా ఉంది. వ్యక్తి స్వాతంత్య్రం ప్రధానంగా వెలువడిన వాదం ”అస్తిత్వ వాదం” (Externalism). ఆర్‌.ఎస్‌.సుదర్శనం, వేగుంట, నిఖిలేశ్వర్‌, మాదిరాజు రంగారావు వంటివారు ఈ ధోరణిలో కవిత్వం రాశారు. 1947 తర్వాత ఆధునిక కవిత్వాన్ని బాగా ప్రభావితం చేసినవాదం ”ప్రతీకవాదం” (Symbolism). సంవిధాన శిల్పానికి ప్రతీకవాదం ఉపకరించింది. కవి వాడిన ప్రతీకలు తెలిస్తే ఆనందమే. లేకపోతే అస్పష్టత తప్పదు. వస్తువును వ్యాఖ్యానించటానికి, అనల్ప భావాన్ని సంక్షిప్తంగా వివరించడానికి ప్రతీక తోడ్పడుతుంది. ప్రతీకలు కవిభావాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే వైయుక్తికమై ఉంటాయి. ”సమగ్ర భావమయ ప్రపంచం” ప్రతీకలలో దర్శనమిస్తుంది. ఆరుద్ర ”త్వమేవాహం” కావ్యం ప్రతీకాత్మక కావ్యం. శ్రీరంగనారాయణబాబు, శ్రీశ్రీ, శేషేంద్ర, సినారె వంటివారు ప్రతీకల్ని సమర్థవంతంగా ప్రయోగించారు. ఆధునిక కవి ‘ప్రతీక’లు లేకుండా మంచి కవిత్వం రాయలేడని చెప్పదగినంతగా ప్రతీకవాదం వ్యాపించింది.

ఆధునిక కవిత్వంలో భావచిత్రణ లేదా పదచిత్రణ (Imagism) ముఖ్యమైన కవితా శిల్పమైంది. కవిత్వంలో గొప్ప అభివ్యక్తికి ఈ భావచిత్రణ ప్రధానసాధనమైంది. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన ఈ ”టెక్నిక్‌”కి ఎజ్రాపౌండ్‌ను చెప్తారు. అతని ప్రభావంతోనే తెలుగులో ‘ఇమేజిజమ్‌’ను కవులు సమర్థవంతంగా ప్రయోగించారు. ”భావచిత్రం మనోనయనానికి రూపుకట్టేది. ఇంద్రియ స్పర్శగలది. శబ్దాల ద్వారా రూపుకట్టేది” – భావచిత్రం! కవితా నిర్మాణ సామగ్రిలో పదచిత్రణ ముఖ్యమైంది. పాఠకుడ్ని ఉత్తేజపరచటంలో, పాఠకుడిలో సంపూర్ణ అవగాహన, అనుభూతి కలిగించటంలో పదచిత్రణ తోడ్పడుతుందిగానీ – ఇక్కడ కూడా అస్పష్టత తప్పదు! డాడాయిజమ్‌ లేదా విధ్వంసనవాదం అనే ధోరణిలో కొందరు కవిత్వం రాశారుగానీ ఆదరణ లభించలేదు – పాఠకుల మెప్పు పొందలేకపోయింది. ఫ్రాయిడ్‌ మనో విశ్లేషణ శాస్త్రం (Psycho analysis) ఆధారంగా ఆధునిక కవిత్వంలో కొంతమంది ”అధివాస్తవికతా వాదం” ప్రవేశపెట్టారు. దీనిని ‘సర్రియలిజమ్‌’ అంటారు. అన్వయరాహిత్యం, అవ్యక్త ప్రేలాపన, అజ్ఞాతంగా ఉన్నవాటిని బహిరంగపరచడం అధివాస్తవికతా లక్షణం. శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబులు ఈ తరహా కవిత్వం రాశారు. వేగుంట వారి వంటి కవిత్వంలోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. అయితే ఇది కేవలం ప్రయోగవాదంగానే నిలిచిపోయింది.

ఆధునిక కవిత్వంపై హేతువాద ప్రభావమూ కనిపిస్తుంది. ”నిర్హేతుకమైన భావాలకూ, ప్రమాణాలకూ తావులేకుండా, యదార్థమైన జ్ఞానాన్ని గుర్తించడమే హేతువాదం” అంటారు త్రిపురనేని రామస్వామి పద్యాలలో ఈ హేతువాద ధోరణిని వ్యాప్తిగావించారు. దళిత వాదంలో హేతుభావాల ఛాయలు కనిపిస్తాయి.

మానవుడే అన్నిటికి మూలం. మానవుడి సంక్షేమమే ప్రధానం. వ్యక్తి సమాజానికి బలి కాకూడదు. వ్యక్తి స్వేచ్ఛ, మానవ సంబంధాలు లేని సమాజం అభివృద్ధి చెందదు. మానవ జీవితం పవిత్రమైంది… అనే భావనలతో మానవతావాద కవిత్వం వెలువడింది. శేషేంద్ర, సినారె, కుందుర్తి, కాళోజీ, పాపినేని శివశంకర్‌, కొప్పర్తి మొదలైన కవుల కవిత్వంలో మానవతావాదం ఎక్కువగా కనిపిస్తుంది.

సుప్రసన్న, సంపత్కుమార, పేర్వారం జగన్నాధం, నరసింహారెడ్డి అనే నలుగురు కవులు చేతనావర్త ధోరణితో కవితా సంకలనాలు తెచ్చారు. అందుకే వీళ్ళని చేతనావర్త కవులు అంటారు. సంప్రదాయ స్పృహ, దేశభక్తి, ఆధ్యాత్మిక దృష్టి ఈ కవిత్వ లక్షణాలు. విదేశీ ”ఇజాల”ని అంగీకరించరు. ప్రగతివాద కవి మార్క్సిస్టు అయి ఉండాలనటం సరికాదంటారు. రాజకీయాలకు అతీతంగా కవి ఉండాలంటారు. ‘చేతనావర్త కవిత్వం’ అనే బృహత్‌ సంపుటం వెలువడింది. అయితే ఇది కొంతకాలం – ఒక ధోరణిగా పేరుపొందింది తప్ప – దీనివల్ల ప్రభావితులైనవారూ, అనుయాయులూ ఉన్నట్టుగానీ – బాగా ప్రచారం పొందిందనిగానీ చెప్పటం కష్టం. కొంతమంది ‘పైగంబర కవులు’గా, ‘నిరసన కవులు’గా కవిత్వం రాసినా గుర్తింపు రాలేదు.

ఇన్ని ఉద్యమాలూ, ఇన్ని నవీన ధోరణుల మధ్య పద్యకవిత్వం తన స్థానాన్ని పదిలం చేసుకొంది. ”నవ్య సంప్రదాయ ఉద్యమం”గా కొందరు ప్రకటించినా – దానిని ఉద్యమం అనటం సమంజసం కాదు. ఇదీ ఒక ధోరణి మాత్రమే! ఈ నవ్య సంప్రదాయానికి విశ్వనాథ సత్యనారాయణ నాయకుడు. గడియారం వేంకటశేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, ముదిగొండ వీరభద్రమూర్తి, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి, ఉత్పల సత్యనారాయణాచార్య, కరుణశ్రీ, పైడిపాటి సుబ్బరాయశాస్త్రి, వానమామలై వరదాచార్యులు మొదలైనవారి కావ్యాలు ఈ నవ్య సంప్రదాయ ధోరణికి చెందుతాయి. జాతీయతకీ, దేశీయతకీ, గత వైభవ సంస్మరణకీ, ప్రాచీన సాహిత్య వైశిష్ట్యానికీ ప్రాధాన్యం ఇస్తుందీ నవ్య సంప్రదాయం. ప్రాచీన సాహిత్యాన్ని నవీనంగా పునఃప్రతిష్టించాలని చెప్తుంది. పాశ్చాత్య సాహిత్యానికి బానిస కావద్దంటుంది. మన సంస్కృతినీ, వారసత్వాన్నీ గౌరవించాలని హితవు పలుకుతుంది. ‘జాతీయ దృక్పథం’ ఈ ధోరణికి ఉనాది. రాజకీయాలు లేని సాహిత్య సామాజిక స్పృహకి నవ్య సంప్రదాయ కవులు ప్రాధాన్యమిచ్చారు. అయితే మన గత వైభవాన్ని, మూలాల్ని మరచిపోకూడదని బోధించే ఈ వాదం ఉద్యమరూపం పొందలేదన్నది సత్యం.

1947 నుంచి ఆధునిక కవిత్వంలో రూప ప్రాధాన్యం గమనిస్తాం. పద్యరూపం ఆధునిక భావజాల ప్రకటనకి సముచిత రూపం కాదని ‘వచన కవిత’ అవతరించింది. ఇంగ్లీషులోగల ‘ఫ్రీవర్స్’ అనేది ‘వచన కవిత’గా వచ్చింది. సరళంగా, వాడుక భాషలో, నియమ రహితంగా, స్వేచ్ఛగా రాసే అభినవ రూపంగా ‘వచన కవిత’ వ్యాప్తి చెందింది. కుందుర్తి ‘ఫ్రీవర్స్‌ ప్రంట్‌’ ద్వారా వచన కవితోద్యమాన్ని చేపట్టారు. ‘వచన కవిత’ బహుళవ్యాప్తి పొందింది. ఇవాళ కవిత్వమంటే వచన కవిత్వమే అన్నంతగా ప్రాచుర్యం పొందింది. ‘మినీ కవిత్వం’ కూడా కొంతకాలం ఉద్యమస్థాయిలో వెలువడింది. అద్దేపల్లి రామమోహనరావు, రావిరంగారావు, కొల్లూరి, జివి పూర్ణచంద్‌, గుత్తికొండ సుబ్బారావు మొదలైనవారు మినీ కవిత్వోద్యమ సారథులయ్యారు. వచన కవిత్వాన్ని ఇమేజిజమ్‌, అస్పష్టత, వచనప్రాయం… అనే అవలక్షణాల నుంచి మినీ కవిత్వం వచన కవిత్వాన్ని రక్షించింది. వ్యంగ్యం, క్లుప్తతలు ప్రధానంగా వెలువడిన మినీ కవిత్వం కొత్త కవుల్ని తయారు చేసింది. కొల్లూరి ‘మినీ కవిత విప్లవం’ అనే సంకలనాన్ని మొదటగా తీసుకొచ్చాడు. నేటికీ రావి రంగారావు మినీ కవిత్వ ప్రచారాన్ని కొనసాగిస్తూనే వున్నారు.

వచన కవిత్వంలో చెప్పుకోదగిన విశేష పరిణామం ‘దీర్ఘ కవిత’. కుందుర్తి కథా కావ్యాలు రావాలని పిలుపునిచ్చినా అప్పటికి ఎవరూ స్పందించలేదు. కథా కావ్యాలతో పాటు ఎక్కువగా దీర్ఘ కవితలు (Long poems) వెలువడ్డాయి- వెలువడుతూ ఉన్నాయి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై విశిష్టమైన దీర్ఘ కవితలు వెలువడ్డాయి. తెలంగాణా నుంచి ప్రాంతీయ స్పృహతో చాలా దీర్ఘ కవితలు వెలువడ్డాయి. జూలూరు గౌరీశంకర్‌, జూగంటి జగన్నాథం, ఛాయారాజ్‌ వంటివారు దీర్ఘకవితలు బాగా రాశారు. ఆచార్య సి.నారాయణరెడ్డి ‘ప్రపంచ పదులు’ అనే కొత్త రూపాన్ని సృష్టించారు. శారదా అశోకవర్ధన్‌ మాత్రమే ఈ కవితారూపంలో కవిత్వం రాశారు.

గురజాడ సృష్టించిన ‘ముత్యాలసరం’ రూపంలో కొందరు కావ్యాలు రాశారు. ఆధునిక కవిత్వంలో గేయం ప్రముఖ స్థానం ఆక్రమించుకుంది. గేయం, పాట అనే రూపాలు ఉద్యమ కవిత్వానికి ప్రధాన వాహికలయ్యాయి. విశ్వనాథ, పుట్టపర్తి, బోయి భీమన్న, సినారె, నాగభైరవ, విద్వాన్‌ విశ్వం, బాపురెడ్డి మొదలైనవారు గేయ కావ్యాలతో ప్రస్తుతికెక్కారు. బాలల గేయాలు రాసినవారిలో బి.వి.నరసింహారావు, చల్లా రాధాకృష్ణశర్మ, మిరియాల రామకృష్ణ, నార్ల చిరంజీవి, మసూనా, కరుణశ్రీ వంటివారు బాలల గేయాలు రాశారు.

ఉర్దూలో గజల్‌ కమనీయ కవితాలహరి. అయితే ఆ భాషలో ఎక్కువగా ఈ కవితా రూపం శృంగారపరంగా, తాత్త్వికపరంగా వుంది. దాశరథి కృష్ణమాచార్య గాలిబ్‌ గజల్స్‌ను మొదటగా తెలుగులోకి అనువదించారు. కానీ ఆచార్య సి.నారాయణరెడ్డి తెలుగు గజల్స్‌ సొంతంగా రాసి, పాడటమే కాకుండా గజల్‌ ప్రక్రియకి సామాజిక స్పృహను అద్దారు‌. జపనీస్‌ కవితారూపం ‘హైకూ’ బాగా ప్రచారం పొందింది. ‘హైకూ’ లక్షణాల్ని తెలుగులోకి తీసుకురావటం కష్టం కాబట్టి తెలుగు కవులు ఆ లక్షణాలను పాటించకుండా కేవలం మూడు పాదాలలో హైకూలు రాశారు. గాలి నాసరరెడ్డి, ఇస్మాయిల్‌, పెన్నా శివరామకృష్ణ, బి.వి.వి. ప్రసాద్‌ వంటివారు హైకూల సంపుటాలు ప్రచురించి హైకూ కవితా రూపానికి వ్యాప్తి కలిగించారు. రావి రంగారావు ‘సామాజిక హైకూలు’ రాశారు. ఏమైనా హైకూలలో ప్రగతిశీల భావాలకి, సామాజిక స్పృహకీ చోటు లేదనే చెప్పాలి.
ఆచార్య ఎన్‌.గోపి సొంతంగా ‘నానీ’లు అనే కవితా రూపంలో కవితలు రాసి ఎందర్నో ఆకర్షించారు. నానీలు ఇటీవలి కవితారూపంగా స్థిరపడింది. దాదాపు వందమంది కవులు, కవయిత్రులు ‘నానీ’లు రాశారు. నానీల కవితా సంపుటాలు డబ్బయి వరకు వెలువడ్డాయి. నాలుగు పాదాలలో 20-25 అక్షరాలతో నానీలుంటాయి. నానీలలో తాత్విక చింతనతోపాటు సామాజిక స్పృహ ఉండటం విశేషం.

వచన కవిత్వం ఎంతగా విస్తృతి చెందినా, మరెంతగా ప్రాచుర్యం పొందినా పద్య కవిత్వం వెలువడుతూనే వుంది. విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఈ కాలంలోనే వెలువడింది. పుట్టపర్తివారి ‘శివతాండవం’ ప్రజాదరణ పొందింది. ఉత్పల సత్యనారాయణాచార్యులు ”ఈ జంట నగరాలు – హేమంత శిఖరాలు” కావ్యం ద్వారా పద్యరచనకి కొత్త సొబగులు సమకూర్చారు. జ్ఞానానందకవి, సంపత్కుమార, బేతవోలు రామబ్రహ్మం, రసరాజు, ఆశావాది ప్రకాశరావు, బండ్లమూడి సత్యనారాయణ, అనుమాండ్ల భూమయ్య, నాగభైరవ, ఆచార్య తిరుమల, కులపతి, గరికిపాటి నరసింహారావు, వేముగంటి నరసింహాచార్యులు, కడిమిళ వరప్రసాద్‌ మొదలైనవారెందరో పద్య కవిత్వానికి వన్నెచిన్నెలు సమకూర్చి పద్యం తెలుగువాడి నాల్క అని చాటి చెప్పారు.

ఈ అరవై సంవత్సరాల తెలుగు కవిత్వంలో మరొక ముఖ్యమైన ఉద్యమం తెలంగాణా విముక్తి పోరాటం. దేశానికి స్వాతంత్య్రం లభించినా తెలంగాణా హైదరాబాద్‌ సంస్థానపు నిజాం నవాబు నిరంకుశ పాలనలోనే మగ్గిపోతోంది. నిజాం దుష్ట, నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా కవులు ఉద్యమించారు. దాశరథి, సోమసుందర్‌, కాళోజీ, ఆరుద్ర, రెంటాల మొదలైన కవులతో పాటు యాదగిరి వంటి ప్రజాకవులు నిజాం వ్యతిరేక కవిత్వం రాశారు. తెలంగాణా సాయుధ పోరాట కవిత్వం ప్రత్యేక స్థానం సంపాదించింది.

భాష విషయానికి వస్తే ఉద్యమాల ప్రభావంతో ‘భాషాస్వేచ్ఛ’ లభించింది. వ్యాకరణ సంకెళ్ళు విడిపోయాయి. ‘సారళ్యం’ ప్రాముఖ్యం వహించింది. ప్రజా కవిత్వం వల్ల, అభ్యుదయ, విప్లవ, దళిత ఉద్యమాల వల్ల ప్రజల భాషకి, వాడుక భాషకీ, మాండలికాలకీ ఆదరణ లభించింది. కోస్తా మాండలికేతర మాండలిక భాషలలో విశిష్టమైన కావ్యాలు వెలువడ్డాయి. ముఖ్యంగా తెలంగాణా మాండలికంలో విలక్షణమైన, ఉదాత్తమైన కావ్యాలు వచ్చాయి. గత అరవై సంవత్సరాల తెలుగు కవిత్వాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే బహుముఖాలుగా విస్తరిల్లుతోందనీ, ఇతర భాషలలోని కవిత్వంకంటే వస్తుపరంగా భాషాపరంగా ముందు వరుసలోనే ఉందనీ, ఈ ఆధునిక కవిత్వం సమాజపరమై మనిషి మనుగడ కోసం, మానవత్వం కోసం పరితపిస్తోందనీ, ‘కాదేదీ కవిత్వానికి అనర్హం’, ‘కవిత్వమొక తీరని దాహం’ అనేవి అక్షర సత్యాలనీ నిరూపిస్తూ దినదినాభివృద్ధి చెందుతోందని తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి