అమృతం కురిసిన రాత్రి
నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం,జరామయం
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణిస్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్రవిచిత్రాలు.
అగాథ బాధా పాథ పతంగాలూ
ద్జర్,అవీరుల కృతరక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగరవాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఈరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
దృశ్య భావాలు
ఘోష
హేష
మురళి
రవళి
కదలి కదలి
ఘణం ఘణం నిక్వణ క్వణల ఝణం ఝణం
బండిమువ్వ
కాలిగజ్జె
కలసిపోయి
పక్షిరెక్క
పొన్నమొక్క
జొన్న కంకె
తగిలి పగిలి
వానచినుకు చిటపటలో కలసి
కొబ్బరిమొవ్వ పిచ్చుక గొంతులో మెరసి
మూలుగు యీలుగు కేక
చప్పటులు చకచకలు నవ్వు
పొదివికొనీ అదిమికొనీ
కదలి కదలి
ఘోష
హేష
మురళి
రవళి
నా మనస్సులో నిశ్శబ్ధపు స్తంభంలా
నిలుచున్నవి
చదల చుక్క
నెమలి రెక్క
అరటిమొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క
కడలి వచ్చి ప్రిదిలినవ్వి
నవ్వి నవ్వి నీరెండల పరుగులెత్తి
మావి తోపు నీడనాడి
కుంద జాజి సేవంతుల
వంగ మల్లీ మందారాలు బంతులాడి
కొలనిగట్ల పడుచుపిల్ల
కుచ్చెళ్ళతో పంతమాడి
కలల మెట్ల వంగినడచి
అలల కడలి అంచులొరసి
నా తలపులో కలసిపోయి
నా పలుకులలో పరిమళించు
చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క
ప్రాతః కాలం చీకటి నవ్విన చిన్ని వెలుతురా! వాకిట వెలసిన వేకువ తులసివా! ఆశాకుంతల ధ్వాంతములో నవసి యిలపై వ్రాలిన అలరువా!-అప్స రాంగనా సఖీ చిరవిరహ నిద్రాపరిష్వంగము విడ ఉడు పథమున జారిన మంచు కలనా! ఆకలిమాడుచు వాకిట వాకిట దిరిగే పేదల సురిగే దీనుల సుఖ సుస్తిని చెరచే సుందర రాక్షసివా! యుద్ధాగ్ని పొగవో- వి రుద్ధ జీవుల రుద్ధ కంఠాల రొదలో కదిలెడి యెదవో! అబద్ధపు బ్రతుకుల వ్యవ హారాల కిక మొదలో? కవికుమారుని శుంభ త్కరుణా గీరమవా! శ్రీ శాంభవి కూర్చిన శివఫాల విలసితమౌ వెలుగుల విబూద్వా! దేశభక్తులూ, ధర్మ పురుషులూ చిట్టితల్లులూ,సీమంతినులూ ముద్దుబాలురూం ముత్తైదువలూ, కూడియాడుచు కోకిల గళముల పాడిన శుభాభినవ ప్రభాత గీత ధవళిమవా!